సూర్యాపేట టౌన్, డిసెంబర్ 6 : దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో దివ్యాంగులకు అత్యధిక పింఛన్లు అందించడంతో పాటు వారిని ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని దివ్యాంగుల సంఘం రాష్ట్ర నాయకులు నేండ్ర మల్లారెడ్డి, భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ అన్నారు. సూర్యాపేటలో దివ్యాంగుల భవనం ఏర్పాటు చేస్తానని ఇటీవల పేటలో నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంలో రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హామీ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులకు రూ. 3 వేల పింఛన్ అందించే రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో కూడా తెలంగాణ మాదిరిగా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. తెలంగాణలో సుమారు 7 లక్షల మంది దివ్యాంగులకు పింఛన్లు అందుతుంటే ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో మాత్రం 40 వేల మందికి మాత్రమే పింఛన్లు అందుతున్నాయన్నారు.
సీఎం కేసీఆర్ దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. తమకు అన్ని విధాలుగా అండగా ఉంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు, మంత్రి జగదీశ్‌రెడ్డికి దివ్యాంగులు అండగా నిలుస్తారని తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లూరి ఈదయ్య, ఉపాధ్యక్షులు మున్న మధు యాదవ్, పేర్ల సోమయ్య, రాష్ట్ర నాయకులు గుణగంటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.