– నల్లగొండ కలెక్టర్ కార్యాలయంలో ఏఓ కు టీడబ్ల్యూజేఎఫ్ వినతి
నీలగిరి, నవంబర్ 21 : జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్ కార్యాలయం ముందు జర్నలిస్టులు నిరసన చేపట్టారు. అనంతరం కార్యాలయంలోని పరిపాలన అధికారి మోతిలాల్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ అయూబ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మూడు సంవత్సరాలుగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వకపోగా, దానిని రెన్యువల్ చేసుకుంటూ పోతున్నారన్నారు. ఈ మూడేళ్ల కాలంలో అనేక మంది జర్నలిస్టుల మార్పులు చేర్పులు జరిగాయని, దాని వల్ల వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ రాక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తక్షణమే కొత్త అక్రిడేషన్ కార్డు జారీ చేసే విధంగా విధివిధానాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
జిల్లాల వారీగా అక్రిడేషన్ కమిటీలను నియమించాలన్నారు. అలాగే అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మండలాల వారిగా పనిచేసే జర్నలిస్టులకు మండల కేంద్రాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం జారీ చేసిన హెల్త్ కార్డులు ప్రైవేట్, కార్పొరేటర్ ఆస్పత్రుల్లో చెల్లుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఆ కార్డుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అన్ని ప్రభుత్వ, కార్పోరేట్ ఆస్పత్రుల్లో చెల్లుబాటు అయ్యేలా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో 50 శాతం ఫీజు రాయితీ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
మహిళా జర్నలిస్టులు విధులు ముగించుకుని రాత్రి వేళలో ఇంటికి వెళ్లే సమయంలో రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి సమస్యలు త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని కోరగా, ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపిస్తానని ఏఓ మోతిలాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు సాదత్ అలీ, వరుణ, జిల్లా నాయకులు పుష్ప లత, ఖాజా నాజీముద్దీన్, నరేందర్ రెడ్డి, నాగయ్య, రామకృష్ణ, బాలరాజు, సైదులు, హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.