పాలకవీడు, జనవరి 21: తెలంగాణ ప్రాంతంలోని అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటైన, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే జాన్‌పహాడ్ దర్గా మహోత్సవం గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మహోత్సవం మూడురోజుల పాటు జరగనుంది. దీనికి అధికారులు, దర్గా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏడాదికి ఒకసారి జనవరి చివరి మాసంలో జరిగే సైదన్న మహోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు తరలిరానున్నారు. ఈ దర్గాను దర్శించుకునేందుకు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మూడు రోజులపాటు నిర్వహించే ఉత్సవ ఏర్పాట్లను బుధవారం సూర్యాపేట జిల్లా అడిషనల్ ఎస్పీ రవీందర్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం జేపీఎస్ ఫంక్షన్ హాల్లో అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దర్గాకు వచ్చే భక్తుల సదుపాయాల కోసం రెవెన్యూ, పంచాయతీ సిబ్బందితోపాటు, దక్కన్ సిమెంట్ కర్మాగారాల యాజమాన్యం ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేశారన్నారు. వైద్యారోగ్య, పోలీస్ శాఖ, ఆర్టీసీ, అగ్నిమాపక శాఖ, 108 సిబ్బంది, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పర్యవేక్షిస్తున్నాయన్నారు. దర్గా వద్ద పారిశుధ్య పనులకు 3 షిప్టుల విధానం ద్వారా 22 మంది పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలో 200 మంది సిబ్బందితో పాటు తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు, 4 ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నట్లు ఎంపీడీవో లక్ష్మి తెలిపారు. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పాలకవీడు, నేరేడుచర్ల, పెంచికల్‌దిన్న పీహెచ్‌సీల్లోని 40కి పైగా సిబ్బందితో 2 ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ డిపోల నుంచి 20కి పైగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయా డిపోల మేనేజర్లు తెలిపారు. దర్గా ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు యం త్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 600 మంది పోలీసులను బందోబస్తుకు నియమించారు. ప్రత్యేక పోలీసులు, హోంగార్డులతో పాటు రోప్‌వే సిబ్బందిని నియమించడంతోపాటు దర్గా పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో అనుక్షణం పరిశీలించనున్నారు. దర్గా వద్ద భక్తులను నియంత్రించడానికి దర్గా ఎదుట, లోప ల ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు ఏర్పాటు చేశారు. శూన్యపహాడ్ రహదారి వెంబడి, జాన్‌పహాడ్ రోడ్లో వేర్వేరుగా పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసినట్లు అడిషనల్ ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ చరమందరాజు, తాసీల్దార్ కమలాకర్, వైద్యాధిరులు నాగిని, సౌమ్యశ్రీ, ఎస్ఐ కోటేశ్ పాల్గొన్నారు.