యాదగిరిగుట్ట, మార్చి 26 : శుభకార్యాలకు బంగారం ఆభరణాలు చేయించేందుకు డబ్బులిచ్చిన వారిని, నగలు తాకట్టు పెట్టి నగదు తీసుకున్నవారిని, వడ్డీకి డబ్బులు తీసుకున్న వారిని బురిడీ కొట్టించి పారిపోయిన జై భవానీ జ్యువెల్లర్స్ యజమానులు జితేందర్లాల్, మధురాములును అదుపులోకి తీసుకున్నట్లు యాదగిరిగుట్ట పట్టణ సీఐ రమేశ్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు నల్లగొండ జిల్లా చిట్యాల సమీపంలో రెక్కీ నిర్వహించి నిందితులను అరెస్టు చేసినట్లు బుధవారం ఆయన మీడియాతో వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి కేజీ 185 గ్రాములు బంగారం, 64 కేజీల 620 గ్రాముల వెండి అభరణాలు స్వాధీనం చేసుకున్నామని, మరో కేజీ 946 గ్రాములు బంగారం సౌత్ ఇండియా బ్యాంకులో తనఖా పెట్టినట్లు గుర్తించామని తెలిపారు.
నిందితుల వద్ద లభించిన బంగారం, వెండిని సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేయనున్నట్లు చెప్పారు. కారును సీజ్ చేసి నిందితులు జితేందర్ లాల్, మధు రాములును రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన జితేందర్ లాల్ 15 ఏండ్ల క్రితం యాదగిరి గుట్ట పట్టణంలో అద్దె భవనంలో జై భవానీ జ్యువెల్లర్స్ షాపును ఏర్పాటు చేశాడు. చాలా ఏండ్లు గా గుట్టలో నమ్మకంగా ఉండటంతో పట్టణవాసులు జితేందర్ లాల్ వద్ద బంగారం తాకట్టు పెట్టారు. మరికొంత మంది వడ్డీకి పెద్ద మొత్తంలో డబ్బులిచ్చారు. ఇంకా కొంతమంది ఆభరణాలు చేసి ఇవ్వాలని రూ. లక్షల్లో నగదును అందజేశారు.
ఈ క్రమంలో గత జనవరి నెలలో షాపును తీయకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు జితేందర్లాల్కు ఫోన్ చేయడంతో స్విచ్ఛాప్ వచ్చింది. భయాందోళనకు గురైన పట్ణణవాసులు జనవరి 24న బంగారం షాపు వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో గత నెల 25న కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడికి సంబంధించిన షాపును సీజ్ చేసి మొబైల్ ఫోన్ల సిగ్నల్‌ను గుర్తించే పనిలో పడ్డారు. అయినా ఆచూకీ లభించక పోవడంతో పోలీసులు రాజస్థాన్‌లో ఓ నిందితుడి ఇంటికి సైతం వెళ్లారు. అదే సమయంలో నిందితుడి తండ్రి సైతం మృతి చెందడంతో పోలీసులు తిరుగు ప్రయాణమయ్యారు. తాజాగా నిందితులు బంగారు ఆభరణాలతో పట్టుబడటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.