– బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
– గ్రామ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడి డిమాండ్
పెన్‌పహాడ్, ఫిబ్రవరి 05 : చీదెళ్ల శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఫొటో ఉన్న ఫ్లెక్సీని చింపిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ శాఖ అధ్యక్షుడు, కీర్తి వెంకట్రావు, మాజీ సర్పంచ్ పరెడ్డి సీతారాం రెడ్డి, మాజీ ఎంపీటీసీ జూలకంటి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం చిరిగిన ప్లెక్సీ ముందు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికార పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చించేందుకు ప్రోత్సహించి శునకానందం పొందుతున్నారన్నారు. ఎన్నడు లేని విధంగా చీదెళ్ల జాతరకు రాజకీయ రంగు పూస్తూ జాతరలో అధికార కాంగ్రెస్ పార్టీ కలర్ లైటింగ్ పెట్టడంతో పాటు డాన్స్ ప్రోగ్రాంలో కాంగ్రెస్ పాటలు పెడుతూ డ్యాన్స్‌లు చేస్తూ అరాచకం సృష్జిస్తూ గ్రామ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు.
గత 20 సంవత్సరాల క్రితం పంట పొలాలకు చుక్క నీళ్లు లేని పరిస్థితుల్లో లిఫ్ట్ మరమ్మతులు చేపట్టి పెద్ద చెరువును నింపి సస్యశ్యామలం చేసిన వ్యక్తి జగదీష్ రెడ్డి అని కొనియాడారు. అదేవిధంగా గ్రామాన్ని దత్తత తీసుకుని కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి గోదాం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రూ.5 లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్, గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేసి చీదెళ్లను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన మహానుభావుడి ఫొటోతో ఉన్న ఫ్లెక్సీ చింపడం పిరికి పంద చర్య అని దుయ్యబట్టారు. జాతరలో ప్లెక్సీలు చింపి రాజకీయ కక్షలకు తావు ఇవ్వడం మంచిది కాదన్నారు. పోలీసులు దర్యాప్తు చేసి ప్లెక్సీ చింపిన వారిని గుర్తించి తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ వెన్న సీతారాం రెడ్డి, మోదుగు నర్సిరెడ్డి, ఆలయ కమిటీ వైస్ చైర్మన్ యాలమంచయ్య, జూలకంటి రాజశేఖర్, కొండమిది వెంకన్న, జూలకంటి వేణు, బొల్లం నాగరాజు, నల్లబోలు లింగారెడ్డి, కొండమిది గోపి, కొండమిది మురళి, నుకల శ్రీనివాస్ రెడ్డి, కోచర్ల మస్తాన్, సంకర మద్ది జానారెడ్డి, భూమిరెడ్డి రవి, కొండమీది సుధాకర్ పాల్గొన్నారు.