నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్23(నమస్తే తెలంగాణ) : రామన్నపేటలో జనావాసాల మధ్య తలపెట్టిన అదానీకి చెందిన అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటుపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అదానీకి జీ హూజూర్ అనేలా పోలీసు యంత్రాంగాన్ని మొత్తం రంగంలోకి దింపి ప్రజాభిప్రాయ సేకరణకు తరలివచ్చే వారికి అడుగడుగనా ఆటంకాలు కల్పించారు. కంపెనీ ఏర్పాటును స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వారిని అక్కడికి రాకుండా అన్ని ప్రయత్నాలు చేశారు. బీఆర్ఎస్ నేతలపై ప్రధానంగా దృష్టి సారించి తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల కదలికపై మంగళవారం రాత్రి నుంచే దృష్టిపెట్టారు. బుధవారం ఉదయం నుంచే పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. రాచకొండ పోలీసులతో పాటు నల్లగొండ జిల్లా పోలీసు యంత్రాంగం అదనపు బలగాలతో రోడ్లపైకి వచ్చారు.
దీంతో రామన్నపేటకు వస్తున్న నేతలందరీన్ని ఎక్కడికక్కడే అడ్డగించారు. రామన్నపేటకు బయల్దేరిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతోపాటు మరికొందరు నేతలు చిట్యాల సమీపంలోనే పోలీసులు అడ్డగించారు. వీరిని బలవంతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించి అదుపులోకి తీసుకున్నారు. తాను స్థానిక మాజీ ఎమ్మెల్యేను ప్రజల పక్షాన తన అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు తనకు ఉందని వాదించినా పోలీసులు వినిపించుకోలేదు. ఆయన్ను పక్కనే ఉన్న మునుగోడు, ఆ తర్వాత ఉన్న చండూరు పోలీసు స్టేషన్లను కాదనీ మారుమూల ప్రాంతమైన నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత హైదారాబాద్ నుంచి రామన్నపేటకు వెళ్తున్న మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ను రామన్నపేట శివారులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను మోత్కూర్ పోలీసు స్టేషన్‌కు తరలించి మధ్యాహ్నం తర్వాత వదిలేశారు.
భువనగిరి మీదుగా రామన్నపేటకు వస్తున్న మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావును భువనగిరిలోనే పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడే నిర్బంధించారు. ఇదే సమయంలో రామన్నపేటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారన్న సమాచారంతో నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఇంటికి పోలీసులు భారీ ఎత్తున చేరుకున్నారు. అప్పటికే భూపాల్‌రెడ్డితోపాటు అక్కడే ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డిని ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. హౌస్ అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించి బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇక తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్, పార్టీ రాష్ట్ర నేత డాక్టర్ చెరుకు సుధాకర్ కదలికలపై నిఘా పెట్టి రామన్నపేటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. మరికొందరు ముఖ్య నేతల కదిలికలపై నిఘా పెట్టి తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఎవరి ఆదేశాల మేరకు అరెస్ట్ చేశారో చెప్పాలి : మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనకుండా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను, పార్టీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేయడంపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎవరి ఆదేశాల మేరకు నిర్బంధాలు, అరెస్టులు చేస్తున్నారో ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ ప్రజల మధ్య జరుపకుండా మారుమూల ప్రాంతంలో జరపడాన్ని బట్టే ఉద్దేశమేంటో స్పష్టం అవుతుందన్నారు. అక్కడికి తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు వెళ్తున్న ప్రజలను, ప్రజాప్రతినిధులను అడ్డుకుని అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అక్రమ అరెస్టులు, అడ్డగింతలు, గృహా నిర్బంధాలు చేస్తూ మరీ ఏ ప్రజల అభిప్రాయాలను సేకరిస్తారో చెప్పాలన్నారు. కోదండరాం, హరగోపాల్‌లు కోరుకున్న మార్క్ ప్రజాపాలన, ప్రజాభిప్రాయ సేకరణ ఇదేనా? ప్రభుత్వ నిర్బంధంపై ఇప్పటికైనా నోరువిప్పాలని సూచించారు. మూసీ ప్రక్షాళన అంటూ దాని పుట్టుక ప్రాంతంలో దామగుండం రాడర్ కేంద్రం పెట్టి, చివరలో రామన్నపేటలో ఆదానీ సిమెంట్ కంపెనీ పెట్టడంలో మర్మమేమిటని నిలదీశారు. ఎవరి ప్రయోజనాల కోసం సీఎం రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళనకు 1.50లక్షల కోట్లు వెచ్చిస్తానంటున్నాడో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. రేవంత్‌రెడ్డి పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, ఇలాంటి నిర్బంధాలు, అరెస్టులు బీఆర్ఎస్కు కొత్తకాదన్నారు. అదానీ సిమెంట్స్‌కు వ్యతిరేకంగా అక్కడి ప్రజల పక్షాన కచ్చితంగా నిలబడతామని ఆయన ప్రకటించారు.