తుంగతుర్తి, నవంబర్ 12 : మండల కేంద్రంలోని గురుకుల బాలుర పాఠశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నది. కొన్ని రోజులుగా పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ విద్యార్థులపై దురుసుగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో పాఠశాలకు మంగళవారం విచారణ అధికారిగా జనంపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజా విచారణ చేపట్టారు. ఈమేరకు పాఠశాలకు విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకొని జరిగిన ఘటనను వివరించారు. అనంతరం విచారణ అధికారి అధ్యాపకులను, విద్యార్థులను వేర్వురుగా విచారణ చేయడంతో అందరూ ఇన్చార్జి ప్రిన్సిపాల్‌ను తొలగించి రెగ్యులర్ ప్రిన్సిపాల్‌ను నియమించాలని కోరారు.
ఈసందర్భంగా పాఠశాలలో నెలకొన్న సమస్యలను తెలుసుకొని ఆయన ఖంగుతిన్నారు. కొన్ని రోజులుగా రెగ్యులర్ అధ్యాపకులు లేక పాఠశాలలో విద్యాబోధన సరిగా లేదని, మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేవని, అన్నంలో తరచూ పురుగులు వస్తున్నాయని, నీళ్ల సాంబారు, నీళ్ల మజ్జిగ పోస్తున్నారని, కొన్ని సందర్భాల్లో భోజనం సరిపోను అందడం లేదని విద్యార్థులు తెలిపారు. తమ సమస్యలపై కలెక్టర్ స్పందించి పరిష్కరించాలని వేడుకున్నారు. దీంతో సదరు వంట కాంట్రాక్టర్‌ను ప్రశ్నించగా పాఠశాలలో 550మందికిపైగా విద్యార్థులు ఉండగా వార్డెన్ సరిపోను సరుకులు ఇవ్వడంలేదని ఆరోపించారు. అనంతరం విచారణ అధికారి రాజా మాట్లాడుతూ పాఠశాలలో నెలకొన్న సమస్యలపై విచారణ చేపట్టానని, నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నామని తెలిపారు.