 
                                                            యాదగిరిగుట్ట, అక్టోబర్ 30: పక్కా ఆధారాలతోనే యాదగిరిగుట్ట దేవస్థానంలోని విద్యుత్ విభాగం ఈఈ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇంచార్జి ఎస్ఈ వూడెపు వెంకటరామారావు ఇల్లు, అధికార కార్యాలయం, ఇతర ఆస్తులపై దాడులు నిర్వహించామని నల్లగొండ రేంజి ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చంద్ర స్పష్టం చేశారు. గుట్ట దేవస్థానంలోని ప్రసాదాల తయారీ యంత్రాలు అందించే కాంట్రాక్టర్ వద్ద లంచం డిమాండ్ చేయడంతో పాటు రూ. 1.90 లక్షల నగదు తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు వెల్లడించారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మేడిపల్లిలో కాంట్రాక్టర్ వద్ద నుంచి వెంకటరామారావు లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకొని బుధవారం రాత్రి ఆయనను కొండపై ఉన్న ఈఈ కార్యాలయం వద్దకు తీసుకువచ్చి రికార్డులను పరిశీలించారు. గురువారం ఉదయం 11 గంటల వరకు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ దేవస్థానంలోని ప్రసాదాల తయారీ కేంద్రానికి సంబంధించిన బిల్లులు మంజూరు చేసే క్రమంలో ఈఈ తనకు 20 శాతం ఇవ్వాలని కాంట్రాక్టర్ను డిమాండ్ చేయగా రూ. 1.90 లక్షలకు ఒప్పందం కుదిరిందన్నారు.
అయితే లంచం ఇవ్వడం ఇష్టలేని సదరు కాంట్రాక్టర్ నల్లగొండ రేంజి ఏసీబీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశాడన్నారు. బుధవారం మేడారం వెళ్లి వస్తున్న ఈఈ వెంకటరామారావు మేడిపల్లి వద్ద కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ. 1.90 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు వెల్లడించారు. ఆయనను ఆదుపులోకి తీసుకుని యాదగిరిగుట్ట దేవస్థానంలోని ఈఈ కార్యాలయంతో పాటు ఎల్బీనగర్లోని ఇంట్లో సోదాలు నిర్వహించామన్నారు. దేవస్థాన కార్యాలయంలో పలు రికార్డులు స్వాధీనం చేసుకుని సీజ్ చేసిన్నట్లు తెలిపారు. ఈఈ రామారావును నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టామని తెలిపారు.
 
                            