యాదగిరిగుట్ట, మార్చి 24: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండపైకి భక్తులకు తరలించేందుకు వెళ్లే ఆటోల అనుమతిని దేవస్థాన అధికారులు రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. 14 నెలలుగా దేవస్థానానికి ఇవ్వాల్సిన రుసుం పెండింగ్‌లో ఉంది. సుమారు రూ. 60.27 లక్షలు బకాయిలను ఆటో కార్మికులు చెల్లించాల్సి ఉంది. కొన్ని నెలలుగా నోటీసులు ఇచ్చినా ఆటో కార్మికులు స్పందించక పోవడంతో అనుమతిని రద్దు చేయాలని దేవస్థాన అధికారులు నిర్ణయానికి వచ్చిన్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారంలోకి రాగానే కొండపైన ఆటో కార్మికులకు ఎన్నికల సమయంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఇచ్చిన హామీకి ఆదిలోనే బ్రేక్ పడే అవకాశం ఉంది.
పెండింగ్‌లో రూ.60.27 లక్షలు..
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ సేవలను ప్రారంభించింది. గుట్ట నూతన బస్టాండ్, కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, పార్కింగ్ ప్రాంతంలో భక్తులు ఆర్టీసీ బస్సు ఎక్కితే ఉచితంగా కొండపైకి తరలిస్తున్నారు. డబ్బులు చెల్లించే అవసరం లేకుండా ఉండటంతోపాటు ఘాట్ రోడ్ల పనులు కొనసాగుతుండటంతో ఎక్కువ మంది భక్తలను ఎక్కించుకొని వెళ్లే క్రమంలో ప్రమాదం జరిగే అవకాశం ఉండటం, కొండపైన స్థలం తక్కువ ఉండటం వంటి పలు ప్రధాన అంశాలు, భక్తుల భద్రత దృష్ట్యా కొండపైకి ఆటోల అనుమతిని రద్దు చేసింది.
అనంతరం ఆటో కార్మికుల ప్రధాన డిమాండ్‌తో అనుమతిని ఇచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకరించింది. ఇంతలోనే ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారింది. ఆటోలను కొండపైకి అనుమతినిస్తామంటూ ఎన్నికల సమయంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య హామీనివ్వడం అమలులో గతంలో మాదిరిగా దేవస్థానానికి ఒక్కో ఆటో చొప్పున రుసుం చెల్లించాలని ఒప్పందం కుదిరింది. మొత్తం కొండపైకి 296 ఆటోలకు అనుమతినిచ్చారు. ఇందులో 9 మంది ఆటో యూనియన్ నాయకుల ఆటోలకు రుసుంను మినహాయింపు నిచ్చారు.
మిగతా 287 ఆటోలకు రుసుంను విధిస్తూ కొండపైకి భక్తులకు తరలిస్తున్నాయి. 287లో ఒక్కొక్క ఆటోకు నెలకు రూ.1500 ఉండగా ప్రతి ఏటా రూ.18 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం కలిపి నెలకు రూ.4,30,500 దేవస్థానం నిత్యన్నదానం ఖాతాలో జమ చేయాలి. 2024 ఫిబ్రవరి నుంచి 2025 జనవరి వరకు మాత్రమే చెల్లించారని దేవస్థాన గణాంకాలు చెబుతున్నాయి. మిగతా 2025 నుంచి మార్చి 2026 వరకు 14 నెలలు రుసుం రూ.60.27 లక్షలు నగదు పెండింగ్‌లో ఉన్నాయని దేవస్థాన అధికారులు తెలిపారు. ఈ నెలాఖరులోగా చెల్లించకపోతే కొండపైకి ఆటోల అనుమతిని పూర్తిస్థాయిలో రద్దు చేసేందుకు దేవస్థాన అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఎమ్మెల్యే హామీకి బ్రేక్
ఎన్నికల సమయంలో యాదగిరికొండపైన ఆటో యూనియన్ కార్మికులకు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి రాగానే కొండపైకి వాహనాలను అనుమతినిచ్చి ఆటో కార్మికులకు అండగా నిలుస్తామని చెప్పారు. ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి రాగానే 2024 ఫిబ్రవరి 11న కొండపైకి ఆటోలను వెళ్లేందుకు అనుమతిని సైతం మంజూరు చేసి ప్రారంభించారు. ఆటోలో అధికారులను ఎక్కించుకొని ఎమ్మెల్యే స్వయంగా కొండపైకి నడిపించారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. అనుమతికి ఒక్కో ఆటోకు నెలకు రూ.1500 చెల్లించాలని షరతులు పెట్టడంతో కార్మికుల కాస్త ఇబ్బందిపడ్డారు. తప్పని పరిస్థితిలో ఒప్పుకున్నారు. కానీ, ఉచిత బస్సులు ఉండటంతో ఆటోలకు ఆదరణ అంతంత మాత్రమే ఉంది. దీంతో దేవస్థానానికి చెల్లించాల్సి రుసుంను చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. దాదాపు 14 నెలలుగా ఇవ్వాల్సిన రుసుం రూ. 60.27 లక్షలకు పెరిగింది. ఇంత మొత్తం చెల్లించాలా..? ఎలా..? అనే ఆలోచన కార్మికులు ఉన్నట్లుగా సమాచారం. హామీ ఇచ్చిన్నట్టే ఇచ్చి ఈ కొర్రిలేంటని గుర్రుగా ఉన్నట్లు సమాచారం.