నల్లగొండ, అక్టోబర్ 15: సన్న ధాన్యం ప్రభుత్వ రంగ సంస్థల్లో విక్రయిస్తే క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ఊదరగొట్టిన ప్రభుత్వం వానకాలం కొనుగోళ్లు ప్రారంభమైనా గత యాసంగి సీజన్‌కు సంబంధించిన బోనస్ మాత్రం ఖాతాల్లో జమ కాలేదు. దీంతో ఈ సీజన్లో సన్న ధాన్యం పండించిన రైతులు మాత్రం ఇంక ప్రభుత్వాన్ని నమ్మలేక ప్రభుత్వ రంగ సంస్థల్లో సన్న ధాన్యం విక్రయించటానికి ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో గత యాసంగి సీజన్లో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, అందులో 5.78లక్షల దొడ్డు అయితే…22వేల మెట్రిక్ టన్నులు సన్న ధాన్యం.
ఈ సన్న ధాన్యానికి క్వింటాకు రూ.500 చొప్పున రూ.10. 49 కోట్లు బోనస్ రావాల్సి ఉంది. కానీ, ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వ రంగ సంస్థల్లో సన్న ధాన్యం విక్రయించిన 3,120 మంది రైతులు పాత బోనస్ కోసం ఎదురు చూస్తున్నారు. పాత బోనస్సే ఇవ్వలేదు. మళ్లీ సన్న ధాన్యం అమ్మేది ఎలా అనే సందేహాలు రైతుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇదిలాఉండగా ప్రభుత్వ రంగ సంస్థల్లో కాకుండా ప్రైవేటు మిల్లుల్లో సన్న ధాన్యం అమ్మిన రైతులకు క్విం టాకు మిల్లర్లు రూ.2400 పైగా చెల్లించిన విషయం తెలిసిందే.
తేమ పేరుతో కొర్రీలు
వానకాలం సీజన్లో రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెబుతున్న అధికారులు తేమ పేరుతో కొనుగోలు చేయకుండా కొర్రీలు పెడుతున్నారు. జిల్లాలో ఈ సీజన్లో 375 కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పి, ఇప్పటి వరకు 157 కేంద్రాలు మాత్రమే ప్రారంభించారు. అయితే ప్రారంభించిన కేంద్రాల్లో తేమ పేరుతో ధాన్యం కొనటం లేదని రైతులు ఆరోపిస్తున్నా రు. ఈ నేపథ్యంలో కేంద్రాలు ప్రారంభ మై పది రోజులైనా నేటికీ రైతుల నుంచి 680 టన్నులు మాత్రమే కొనుగోలు చేయటం గమనార్హం.