దేవరకొండ, సెప్టెంబర్ 07 : కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ప్రజల పక్షాన ఎండగట్టేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం, తీవ్రంగా అవమానించడం అత్యంత బాధాకరమని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీకి రానివ్వకుండా పోలీసులతో అడ్డుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా డిండి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ప్రశ్నించడం ప్రతిపక్ష ప్రజా ప్రతినిధుల బాధ్యత అన్నారు. అలాంటి ప్రజా ప్రతినిధులను అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సైతం పోలీసులు అడ్డుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని రవీంద్ర కుమార్ అన్నారు. మహిళలను ఈ విధంగా అవమానపరచడమేనా కాంగ్రెస్ చెప్పుకునే ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా మహిళలకు రక్షణ? అని ప్రశ్నించారు.తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల పట్ల ఈ రోజు జరిగిన వ్యవహారం ఒక బ్లాక్ డేగా నిలిచిపోతుందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తూ, అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకున్న అధికారుల తీరును ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రతిపక్ష గొంతును అణచివేయాలని చూస్తోందని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అరాచకాలకు పాల్పడినా ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు. రెండేళ్లలో కచ్చితంగా వచ్చేది బీఆర్ఎస్సేనని, ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ అధికారంలోకి వచ్చి తెలంగాణ అభివృద్ధిని కొనసాగిస్తామని రమావత్ రవీంద్ర కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్, నేనావత్ కిషన్ నాయక్, మండల అధ్యక్షుడు రాజీనేని వెంకటేశ్వర్ రావు, పీఏసీఎస్ చైర్మన్లు పల్లా ప్రవీణ్ రెడ్డి, మాధవరం శ్రీనివాస్ రావు, సర్పంచులు మాల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, కృష్ణయ్య, బషీర్, పట్టణ అధ్యక్షుడు గిరమోని శ్రీను, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు పాల్గొన్నారు.