నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ‘రైతుల కష్టాలు చూస్తుంటే బాధనిపిస్తుంది. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోకి రైతులు ధాన్యం తెచ్చి పోస్తున్నారు. నేటికీ కొనుగోళ్లు సరిగ్గా జరుగుతలేవు. జరిగిన వాటికి డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లో పడ్తలేవు. గతంలో ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల లోపే డబ్బులు అకౌంట్లలో పడేవి. ఇక సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ అన్నారు. కానీ ఇప్పటికీ ఒక్కరికీ కూడా బోనస్ రాలేదు.
దానిపై ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఇట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నరు. అందుకే ఈ వారం రోజుల్లోనే వడ్లు ఎట్లనైనా కొనేలా చేయాలి. ఇది విమర్శ కాదు. ప్రజల్లో ఉన్న బాధ’… ఈ మాటలు అన్నది ఎవరో సామాన్య రైతు కాదు. సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ నేతలే. శనివారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
దీనికి జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు హాజరయ్యారు. కుల గణన, సమగ్ర కుటుంబ సర్వేనే ప్రధాన ఎజెండా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ద్వితీయ శ్రేణి నేతలు క్షేత్రస్థాయిలోని పార్టీ కార్యకర్తల ఇబ్బందులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గళమెత్తారు. ఇందులో నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల ఇబ్బందులను ఏకరువు పెడుతూ వారి కష్టాలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు.
వీటితో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల్లోని ఇబ్బందులను ఎమ్మెల్యేల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 200లోపు యూనిట్ల ఉచిత కరెంటులో ఇప్పటికీ కొందరికి బిల్లులు వస్తున్నాయని, గ్యాస్ డబ్బులు పడడం లేదని కొందరు ఇలా నిత్యం తమ వద్దకు వచ్చి ఎవరో ఒకరు చెప్తున్నారని అన్నారు. ఇలాంటి వాటిలో లోపాలను ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకుపోవాలని విజ్ఞప్తి చేశారు.
పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను గుర్తు పెట్టుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల కమిటీల్లోనూ కష్టపడ్డ కార్యకర్తలకు తగిన గుర్తింపు దక్కలేదన్న భావనలో కార్యకర్తలు ఉన్నారని గుమ్ముల మోహన్‌రెడ్డి సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. తాను మాట్లాడిన దాంట్లో తప్పుంటే క్షమించమని కూడా కోరడం గమనార్హం. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య గుర్తు చేశారు.
కష్టపడిన కార్యకర్తలకు, నేతలకు గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీలో వివక్ష జరుగుతుందని, ఇలాంటి వాటిని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకుపోవాలని విజ్ఞప్తి చేశారు. మిర్యాలగూడ, దేవరకొండకు చెందిన పోలగాని వెంకటేశ్, సిరాజ్‌ఖాన్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందని గుర్తు చేశారు. ఇదే సమయంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సైతం కొందరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరి అల్లర్లు చేస్తున్నారని, అలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలన్నారు.
ప్రభుత్వ పథకాలపై ఎలాంటి వర్గాలు లేకుండా కలిసిమెలిసి పనిచేయాలని తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు నేనావత్ బాలూనాయక్, వేముల వీరేశం, కుండూరు రఘవీర్‌రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న కుల గణన, సమగ్ర కుటుంబ సర్వేలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కుటుంబ సర్వేకు ఆటంకం కలిగించేందుకు బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని, దాన్ని సమర్థవంతంగా తిప్పికొడుతూ ప్రజల్లో ఉంటే సర్వేను విజయవంతం అయ్యేలా చూడాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
కోమటిరెడ్డి బ్రదర్స్, ఎంపీలు డుమ్మా
నల్లగొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో డీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు కుందూరు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు హాజరవుతారని డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ ప్రకటించారు. కానీ ఈ సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డుమ్మా కొట్టారు. వీరితో పాటు ఎంపీలు ఇద్దరు కూడా సమావేశానికి హాజరుకాలేదు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా జరిగిన డీసీసీ భేటీకీ వీరు గైర్హాజరు కావడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.