మిర్యాలగూడ టౌన్, మార్చి 22 : కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పాలన అంటే అక్రమ అరెస్టులేనా అని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ షోయబ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు ఆయనను ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా షోయబ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నిర్బంధ పాలన కొనసాగిస్తున్నాడని, హామీల అమలుపై ప్రశ్నించే గొంతుకులను అణచివేస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడకుండా బడ్జెట్లో కేవలం 7 శాతం నిధులు విద్యాశాఖకు కేటాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్వీ నాయకుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, అరెస్ట్ చేసిన వారందరినీ తక్షణమే విడుదల చేయాలని పేర్కొన్నారు.