మునుగోడు, జూన్ 25 : మునుగోడు పరిధిలోని గ్రామాల్లో బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి దొంగచాటుగా బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై కఠినంగా వ్యవహారించాలని పోలీసులకు మరోమారు సూచించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తెలుసుకోడానికి ఇటీవల పలివెల గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించిన సందర్భంలో పలువురు మహిళలు గ్రామంలో బెల్ట్ షాపుల నిర్వహణను తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ మేరకు గురువారం మునుగోడులోని క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా మరోమారు బెల్ట్ షాపుల నివారణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు. మొదటగా మునుగోడు మండలంలోని గ్రామాల్లో బెల్ట్ షాపు నిర్వాహకుల జాబితా సిద్ధం చేయాలని పోలీసులను ఆదేశించారు. మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ముఖ్యంగా యువత చెడు మార్గం వైపు వెళ్లడానికి మద్యం కారణమవుతుందన్నారు. నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నిర్మూలించిన తర్వాతే గ్రామాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొందని, ఆ వాతావరణాన్ని మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లడానికి అనునిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు.