చిట్యాల, జూలై 30 : వెలిమినేడు పీఏసీఎస్ లో యూరియా బ్లాక్ మార్కెట్ దందాపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి, బాధ్యులైన చైర్మన్ రఘుమారెడ్డి రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొంతకాలంగా చిట్యాల మండలంలోని వెలిమినేడు పీఏసీఎస్ ద్వారా రైతులకు ఇవ్వాల్సిన యూరియాను అక్రమంగా ప్రైవేట్ కంపెనీకి విక్రయించిన ఘటనపై చిట్యాల పట్టణ కేంద్రంలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. గత సంవత్సర కాలం నుండి వెలిమినేడు పీఏసీఎస్ లో అనేక అవకతవకలు జరిగినట్లు ఆయన ఆరోపించారు. చైర్మన్ రఘుమారెడ్డి సొసైటీని బ్రష్టు పట్టించారని, స్థానిక ఎమ్మెల్యే కమీషన్ల దందా కోసమే ఈ దారుణానికి పాల్పడ్డారన్నారు.
బ్లాక్ మార్కెట్ యూరియా దందాపై యావత్ తెలంగాణ రైతులు దుమ్మెత్తి పోస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఇవ్వాల్సిన యూరియా నిల్వను పీఏసీఎస్ చైర్మన్ రఘుమారెడ్డి ఆదేశాలతో DEF Ad Blue అనే ప్రైవేట్ కంపెనీకి అక్రమంగా విక్రయించారని, ఇప్పటికే ఒక్క లోడ్‌కు 50 బస్తాల చొప్పున దాదాపు 1,000 బస్తాలు ప్రైవేట్ సంస్థకు తరలించబడినట్టు ఆయన ఆరోపించారు. ఈ తతంగానికి కారణమైన అసలైన సూత్రధారులను పక్కకు నెట్టి, అమాయక అటెండర్‌పై నేరాన్ని మోపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. ఇది రైతులకు తీవ్ర అన్యాయం చేయడమే కాకుండా వ్యవసాయ రంగంపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు.
రైతులకు ఉచితంగా లేదా సబ్సిడీ ధరకు ఇవ్వాల్సిన యూరియాను ఇలా అడ్డదారిలో తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రైతుబంధు నిలిపివేసిన ప్రభుత్వం, ఇప్పుడు యూరియాను కూడా అందించకుండా రైతులను దుర్భర స్థితిలోకి నెట్టి వేస్తోందని మండిపడ్డారు. దీనికి కారణమైన చైర్మన్ రఘుమారెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలన్నారు. ఈ అక్రమ వ్యవహారానికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే కూడా బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు నష్టాన్ని తీరుస్తూ, యూరియా సరఫరా తక్షణమే పునరుద్ధరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.