నల్లగొండ, మార్చి 5 : ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై నిపుణులతో సమగ్ర విచారణ జరిపించి అం దుకు బాధ్యులైన వారి పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశా రు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరుపాలని బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టన్నెల్లో ప్రమాదం జరిగి 11రోజులు గడుస్తున్నా కార్మికుల ఆచూకీ తెలియకపోవడం విచారకరమన్నారు. ముందుచూపు లేకపోవడం, భద్రత ప్రమాణాలు పాటించకపోవడం, ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ప్రమాదానికి కారణమైన కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టి వలస కార్మిక చట్టం ప్రకారం న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కంచి కేశవులు, ఉపాధ్యక్షుడు అద్దంకి నర్సింహ, పొలె సత్యనారాయణ, సైదాచారి, ఆవుట రవీందర్, కత్తుల శంకర్, వెంకన్న పాల్గొన్నారు.