నల్లగొండ, డిసెంబర్ 15 : ఓ మహిళపై కన్నేసి ఓ పచ్చటి సంసారంలో నిప్పులు పోశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ డానియల్‌పై ఎస్పీ శరత్ చంద్ర పవార్ విచారణ వేగవంతం చేశారు. డీఎస్పీతో ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం విచారణ చేసి నివేదించాలని ఆదేశించిన నేపథ్యంలో సదరు డీఎస్పీ నేడో రేపో నివేదిక అందజేసే పనిలో నిమగ్నమయ్యారు. భార్యాభర్తల మధ్య వచ్చిన ఆస్తి తగాదాలో నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన సీఐ డానియల్ జోక్యం చేసుకొని ఆమెను ట్రాప్ చేశారని, దీంతో తన భార్య మధ్య గొడవ కాస్త ఎక్కువై విడిపోయే పరిస్థితి వచ్చిందని, తన భార్యతో విడాకులు ఇప్పించి ఆమెతో సీఐ సహజీవనం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని సదరు మహిళ భర్త ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో నాలుగు నెలలుగా జరుగుతున్న వ్యవహారం బయటకు వచ్చింది.
అసలేమైందంటే?
జిల్లా కేంద్రంలో నివసించే ఒక మొబైల్ షాప్ యజమాని పదేండ్ల కింద ఒక మహిళను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేండ్ల కింద సదరు వ్యక్తి తన ఇంటి వద్ద ఉన్న వ్యవసాయ భూమి అమ్మి పట్టణంలోని ఒక కాలనీలో కొంత లోన్‌తో ఇల్లు కొని తన భార్య పేరుమీద రిజిస్ట్రేషన్ చేశాడు. ఇటీవల ఈఎమ్ఐలు కట్టలేక దాన్ని అమ్ముదామని భార్య అనుమతి తీసుకొని అమ్మకానికి పెట్టి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ఫైనల్ అమౌంట్ చెల్లించే సమయంలో ఉన్నట్టుండి భార్య మాట మార్చింది. తన భర్త వేధిస్తున్నాడని, తనకు ఇష్టం లేకుండా ఇల్లు అమ్ముతున్నాడని తదితర కారణాలతో టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్లు బాధితుడు తెలిపాడు. ఈ విషయంలో సంబంధిత స్టేషన్ సీఐ సదరు బాధితుడిని బెదిరించి ఆ ఇల్లుకు అడ్వాన్స్‌గా తీసుకున్న డబ్బు కొన్న వాళ్లకు చెల్లించాలని బెదిరించినట్లు బాధితుడు ఎస్పీకి రాసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇంటి వద్ద తన పేరిట ఉన్న భూమి అమ్మి వారికి డబ్బు చెల్లించాలని, ఆ ఇల్లు ఆమె(బాధితుడి భార్య)పేరు మీదనే ఉండాలని సీఐ ఆదేశించాడని తెలిపాడు.
వాట్సాప్ చాటింగ్‌తో బయటపడ్డ సీఐ వ్యవహారం
ఈ వ్యవహారంలో భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో భార్య జిల్లా కేంద్రంలోనే తన చిన్నమ్మ (తన తండ్రి రెండో భార్య) దగ్గర ఉంటుంది. సీఐ ఇంత స్థాయిలో బెదిరిస్తున్న నేపథ్యంలో బాధితుడు ఈ నెల 9వ తేదీన నేరుగా వారి ఇంటికి వెళ్లి ఫోన్ చెక్ చేయడంతో సీఐతో తన భార్య చేసిన చాట్స్ బయట పడ్డాయి. అందులో సదరు సీఐని ‘నా కోసం ప్లాట్ కొన్నావా అంటే ఆయన ప్రాసెస్‌లో ఉన్నానని అనటంతోపాటు నేను నీ హస్బండ్ లాగానే.. నీకు ఏం కావాలి’ అనే కోణంలో చాట్స్ ఉండటంతో ఆ ఫోన్ తీసుకొని వెళ్లి ఎస్పీకి ఫిర్యాదు చేసి మొబైల్ చూపించడంతో విషయం బయటపడింది. సదరు సీఐ బాధితుడితో భార్యకు విడాకులు ఇచ్చేసి ఆమెతో సహజీవనం చేయాలనే ఆలోచనతో ఉన్నాడని, అందులో భాగమే తనను ఇబ్బంది పెట్టి విడాకులు ఇప్పించాలనే కుట్ర జరుగుతుందనేది ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
నాలుగు నెలలుగా ప్రేమాయణం
సదరు మహిళకు, సీఐకి నాలుగు నెలలుగా ఈ ప్రేమాయణం సాగుతున్నట్లు బాధితుడు ఆవేదనతో తెలిపాడు. తన భార్య చిన్నమ్మ పంచాయితీ విషయంలో సదరు సీఐతో పరిచయం ఏర్పడి అప్పడి నుంచి వారు తరచుగా ఫోన్లు మాట్లాడుకుంటున్నారని, దీన్ని తాను పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల తన కుటుంబమే విచ్ఛిన్నమయ్యే పరిస్థితి నెలకొన్నదని ఆవేదనతో చెప్పాడు. తన కొడుకు ప్రస్తుతం హాస్టల్లో ఉంటే కూతురు మాత్రం తనతోనే ఉన్నదని అన్నాడు. దీనిపై చేపట్టిన విచారణ వేగంగా జరుగుతున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర తెలుపగా, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు ఎస్పీకి విన్నవించాడు.