సూర్యాపేట టౌన్, మే 01 : డ్రగ్స్, గంజాయి వినియోగించడం వల్ల మత్తులో ఆలోచన విధానం కోల్పోయి అన్ని రకాల అనర్థాలకు కారణమవుతున్నారని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. గంజాయి రవాణా, సరఫరా, వినియోగం కేసుల్లో నిందితులుగా ఉన్నవారికి వారి తల్లిదండ్రుల సమక్షంలో శుక్రవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన కౌన్సిలింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యువత గంజాయి డ్రగ్స్ మత్తులో నేరాలకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. అదేవిధంగా అనారోగ్యం బారిన పడుతూ భవిష్యత్‌ను కోల్పోతున్నారన్నారు. అందుకే ఈ గంజాయిని మన సమాజం నుండి లేకుండా పారదోలాలన్నారు.
మన పిల్లలను మన సమాజాన్ని ఈ గాంజాయి మత్తు నుండి కాపాడుకోవాలని పిలుపు నిచ్చారు. గంజాయి వినియోగించిన సరఫరా చేసిన అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గంజాయి వినియోగం వల్ల జరుగుతున్న అనర్ధాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గంజాయి వినియోగిస్తున్న వారికి పోలీస్ స్టేషన్ లో డాక్టర్ల సహాయంతో మూత్ర పరీక్షలు చేయించారు. గంజాయి సంబంధ కేసుల్లో ఉన్న వ్యక్తులపై పోలీస్ శాఖ పటిష్టంగా నిఘా ఉంచిందని, కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామన్నారు. ఎన్ డి పి ఎస్ చట్టం ప్రకారం వీరుపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగు తుందని హెచ్చరించారు.
డ్రగ్స్ గంజాయి వినియోగం, రవాణా కేసుల్లో చిక్కుకుంటే గరిష్టంగా 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష జరిమానా పడుతుందని తెలిపారు. ఇలాంటి వారిపై పోలీస్ స్టేషన్ల నందు హిస్టరీ షీట్స్ నమోదు చేస్తామని ఐదు లక్షల వరకు బైండోవర్ చేస్తామని పీడీ యాక్ట్ నమోదు చేసి రెండు సంవత్సరాలు జైలుకు పంపడం జరుగుతుందన్నారు. దీనికి అలవాటుపడి వారిలో మార్పు తేవడానికి పునరావాసం, సత్ప్రవర్తన డీ అడిక్షన్ కేంద్రాలకు పంపడం జరుగుతుందన్నారు. అనంతరం డ్రగ్స్ గంజా నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ లు వెంకటయ్య, రాజశేఖర్, శివకుమార్, ఎస్ఐలు ఏడుకొండలు, శివతేజ, మహేందర్ నాథ్, సాయిరాం, వెంకన్న, ఎస్ఐలు శ్రీకాంత్, గోపికృష్ణ పాల్గొన్నారు.

మత్తు అనర్థాలకు హేతువు : ఎస్పీ నరసింహ