– రూ.2.20 లక్షల నగదు, బైక్, సెల్ఫోన్లతో పాటు పలు పరికరాలు స్వాధీనం
– వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి
నీలగిరి, మే 23 : బ్యాంకుల వద్ద ప్రజల దృష్టి మరలించి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల మూఠాను అరెస్ట్ చేసి వారి నుండి రూ.2.20 లక్షల నగదు, సెల్ఫోన్లు, బైక్ తోపాటు దొంగతనానికి పాల్పడే పలు రకాల వస్తువులను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి తెలిపారు. శనివారం స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 19న నల్లగొండలోని క్లాక్‌టవర్ సమీపంలోని యూనియన్ బ్యాంక్ వద్ద గాదె లింగయ్య అనే రైతు ధాన్యం అమ్మిన డబ్బులను డ్రా చేసుకుని బైక్ కవర్లో పెట్టుకుని తన గ్రామానికి వెళ్లడానికి ద్విచక్రవాహనాన్ని తీస్తుండగా కొంతమంది వ్యక్తులు వేరే బైక్‌ను అడ్డుపెట్టి లింగయ్య దృష్టిని మరలించి రూ.1.50 లక్షలను కాజేసినట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు వన్ టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ పుటేజీ, నేరస్తుల ఫొటోల ఆధారంగా విచారణ చేపట్టాం.
ఈ క్రమంలో ఈ నెల 21న పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ సైదులు, రూరల్ ఎస్ఐ సైదాబాబు వాహనాలను తనిఖీలు చేస్తున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా వారిని వెంటాడి పట్టుకున్నట్లు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా వారు మహారాష్ట్ర రాష్ట్రంలోని సోలాపూర్‌కు చెందిన కేశవ తేజ దోక్వలగా, అతని కుమారుడు (మైనర్ బాలుడు)గా గుర్తించినట్లు తెలిపారు. వారిని పూర్తి స్థాయిలో విచారణ చేయగా 21న తేదిన నకిరేకల్ పట్టణంలోని ఒక రైతు ఎస్బీఐ బ్యాంకు నుండి రూ.1.40 లక్షలు డ్రా చేసుకుని వస్తుండగా వాటిని దొంగిలించి వస్తున్నట్లు తెలిపారు. అంతేగాకుండా ఈ నెల 19న నల్లగొండలో కూడా రాహుల్‌తో కలిసి లక్షన్నర కాజేసినట్లు ఒప్పుకున్నారన్నారు. ప్రస్తుతం రాహుల్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
తక్కువ రోజుల్లో సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో బ్యాంకుల వద్ద అమాయకులను ఎంచుకుని మాయ చేసి బురిడి కొట్టించి వారి డబ్బులు కాజేస్తున్నట్లు తెలిపారు. ఇలా మక్తల్, మరికల్, నల్లగొండ వన్‌టౌన్, ఖమ్మం త్రిటౌన్, నకిరేకల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు. బ్యాంకుల వద్ద అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మవద్దని, ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే డయల్ 100కు ఫోన్ చేయాలని తెలిపారు. కాగా నిందితులు పారిపోతున్న క్రమంలో సహసించి వారిని పట్టుకున్న కానిస్టేబుల్ రాజును డీఎస్పీ అభినందించారు. ఈసమావేశంలో వన్‌టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ సైదులు, అదినారాయణ, లచ్చిరెడ్డి, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది రబ్బాని, రాజా, శంకర్, అజ్మల్, అంజయ్య, కిరణ్, అంజనేయులు ఉన్నారు.