నీలగిరి, జూలై 23 : గత సంవత్సర కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అంతర్ జిల్లా దొంగల ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 20 తులాల బంగారు ఆభరణాలు, 1 కేజీ 800 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక వెండి చెంబు, పల్లెము (మొత్తం 2.5 కేజీలు), ఒక మోటార్ సైకిల్, రెండు ల్యాప్టాప్లు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ కేసు వివరాలు వెల్లడించారు. గత ఏడాది కాలంగా తెలంగాణలోని రాచకొండ, వరంగల్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రాత్రిపూట తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్గా చేసుకుని నిందితులు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
మంగళవారం సాయంత్రం నల్లగొండ పట్టణలోని సవేరా లాడ్జీలో గదిని అద్దెకు తీసుకుని అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక ఎస్ఐ వై.సైదులు రైడ్ చేసి ముఠాలోని బాలెం రాజేశ్, దస్తర్బండి షఫీ, వల్లూరి యువరాజ్, ఉబ్బని యోగేశ్వర్ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మరో ఇద్దరు సాయికుమార్, శ్రీకాంత్ పరారీలో ఉండగా ముఠాలోని ఇంకో సభ్యుడు తలారీ మనోజ్ గంజాయి కేసులో ఇప్పటికే పట్టుబడి జైలులో ఉన్నాడు.
వీరంతా విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి, సులువుగా డబ్బులు సంపాదించాలని ముఠాగా ఏర్పడి రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడేవారన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్, మోత్కూరులో.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాద్నగర్.. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ధర్మసాగర్, ఖాజీపేట.. మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో, నల్లగొండ జిల్లాలోని నల్లగొండ వన్ టౌన్, టూ టౌన్, నల్లగొండ రూరర్ స్టేషన్, చిట్యాల, నార్కెట్పల్లి, చండూరు, మునుగోడు పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 23 దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో నల్లగొండ టూటౌన్ ఎస్ఐ రాఘవరావు ఆధ్వర్యంలో ఎస్ఐలు వై.సైదులు, సైదాబాబు, హెడ్ కానిస్టేబుల్ పాయిలి రాజా, కానిస్టేబుళ్లు లావూరి బాలకోటి, శంకర్, జానకిరామ్ ఎం.ఎ ఫరూక్ కేసును విజయవంతంగా చేధించారు. వీరందరిన ఎస్పీ అభినంధించి రివార్డు అందజేశారు.
Nilagiri : అంతర్ జిల్లాల దొంగల ముఠా అరెస్ట్