హాలియా, అక్టోబర్ 24 : నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజల సాగునీటి కల నెరవేరుతున్నది. పెద్దవూర మండలం పూల్యతండా వద్ద లిఫ్ట్‌ను ఏర్పాటు చేసి డీ 8,9 కాల్వల పరిధిలో ఉన్న 7వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ లిఫ్టు నిర్మాణం కోసం గతేడాది రూ. 2.89 కోట్లు విడుదల చేశారు. ఏడాది కాలంలోనే లిఫ్టు నిర్మాణం పూర్తి చేయడంతో ఈ నెల 12న అధికారులు ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. దాంతో పెద్దవూర, తిరుమలగిరి సాగర్ మండలాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
8 గ్రామాలు.. 7వేల ఎకరాలకు సాగునీరు
ఏఎమ్మార్పీ ద్వారా పెద్దవూర, తిరుమలగిరి సాగర్ మండలాల్లోని పుల్యగూడెం, కుంకుడుచెట్టు, బోనూతల, రంగుండ్ల, పాశంవారిగూడెం, తూటిపేట, గాత్తండా, ఎల్లాపురం గ్రామాల్లోని 7 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో డీ 8, 9 కాల్వల నిర్మాణం చేపట్టారు. కానీ కాల్వల నిర్మాణంలో డీజైన్ లోపం కారణంగా కాల్వ చివరి భూములకు సాగునీరు అందడం లేదు. దాంతో కాల్వ చివరి భూలుల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2021లో జరిగిన నగార్జునసాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచార సమయంలో ఆ ప్రాంత రైతులు విషయాన్ని బీఆర్ఎస్ నాయకులకు తెలిపారు. పెద్దవూర మండలం పూల్వతండా వద్ద ఏఎమ్మార్పీ లోలెవల్ కెనాల్లో లిఫ్టు ఏర్పాటు చేస్తే డీ 8,9 కాల్వల పరిధిలోని 7 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వానికి తెలిపారు. దానికి సమ్మతి తెలుపుతూ అప్పట్లో రైతులకు హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పూల్యతండా వద్ద లిఫ్టు నిర్మాణానికి రూ. 2.89 కోట్లను మంజూరు చేసింది. పనులను అధికారులు నిత్యం పర్యవేక్షించడంతో ఏడాది కాలంలోనే పనులు పూర్తయ్యాయి. ఇటీవల అధికారులు లిఫ్టుకు ట్రయల్న్ కూడా విజయవంతంగా నిర్వహించారు. లిఫ్టు మోటరు ద్వారా 90 క్యూసెక్కుల నీరు కాల్వలోకి వచ్చిపడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల కోడ్ కారణంగా ప్రారంభం వాయిదా
ఈ ఏడాది వాన కాలం ప్రారంభంలోనే డీ 8,9 కాల్వల పరిధిలోని టెలాండ్ భూములకు లిఫ్టు ద్వారా సాగునీరు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించింది. కానీ ఈ ఏడాది వర్షభావ పరిస్థితుల కారణంగా ఎగువ నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి వరదనీరు రాకపోవడంతో లిఫ్టును ప్రారంభించలేక పోయారు. జలాశయానికి వరదనీరు వచ్చాక ట్రయల్న్ నిర్వహించి లిఫ్టును ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే సాగర్ ఎడమ కాల్వ పరిధిలో సాగు చేసిన పొలాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసింది. దాంతో అధికారులు సైతం పెద్దవూర మండలం పూల్యతండా వద్ద డీ 8,9 కాల్వలపై ఏర్పాటు చేసిన లిఫ్టుకు ట్రయల్న్ నిర్వహించారు, ట్రయల్ రన్ విజయవంతమైంది. ఇంతలో కేంద్ర ఎన్నికల సంఘం 2023 శాసనసభ ఎన్నిలకు షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ కారణంగా లిఫ్టు ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎన్నికల అనంతరం లిఫ్టును ప్రారంభించనున్నారు.
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
మాకు 10 కిలోమీటర్ల దూరంలోనే నాగార్జున సాగర్ ఉన్నా మా పొలాలకు ఇంతకాలం నీళ్లు రాలేదు. విషయాన్ని గత పాలకులకు చెప్పినా పట్టించుకోలేదు. సాగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నోముల భగత్ ఎన్నికైన తర్వాత ప్రభుత్వంతో మాట్లాడి లిఫ్టు ఏర్పాటు చేయించారు. డీ 8,9 కాల్వలకు సాగునీరు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో పాటు ఏడాది కాలంలోనే దాని నిర్మాణం పూర్తి చేయించారు. మాకు సాగునీరందిస్తున్న సీఎం కేసీఆర్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాం.
-రమావత్ రాజేశ్ నాయక్, రైతు, కుంకుడుచెట్టుతండా,తిరుమలగిరి సాగర్ మండలం
లిఫ్టు నిర్మాణంతో మా కష్టాలు తీరుతాయి
డీ 8,9 కాల్వల ద్వారా మా పొలాలకు నీరు రాక పోవడంతో సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. విషయాన్ని ఎమ్మెల్యే నోముల భగత్ దృష్టికి తీసుకెళ్లగానే ఆయన ప్రభుత్వానికి నివేదించి లిఫ్టు మంజూరు చేయించారు. లిఫ్టు నిర్మాణం పూర్తి చేయడంతో పాటు ఇటీవల అధికారులు ట్రయల్ రన్ కోసం 8,9 కాల్వలకు నీటిని విడుదల చేశారు. ఆ నీళ్లను చూడగానే ఎంతో సంతోషంగా అనిపించింది. ఈ లిఫ్టు ద్వారా డీ 8,9 కాల్వల పరిధిలో ఉన్న 7 వేల ఎకరాలకు సాగునీరు అందనుండడం శుభ పరిణామం. మాకు మేలు చేసిన బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్‌ను ఎప్పటికీ మర్చిపోలేం.
-ఆంగోతు రమేశ్, తూటిపేట తండా, తిరుమలగిరి సాగర్ మండలం