మునుగోడు, మార్చి11 : మునుగోడు మండల పరిధిలోని జక్కలవారిగూడెం గ్రామంలో ఎండిపోతున్న వరి పొలాలను మునుగోడు వ్యవసాయ సహాయ సంచాలకులు వేణుగోపాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడుతూ.. చౌడు భూమిలో వరి పంట వేసుకున్నప్పుడు జింక్ లోపం వస్తుందన్నారు. ఇది వచ్చినప్పుడు పంట ఎదుగుదల తగ్గిపోయి ఇటుక రంగులోకి మారిపోయి దిగుబడి గణనీయంగా తగ్గుతుందన్నారు. దీని నివారణకు 20 కేజీల జింక్‌ను విధిగా వేసుకోవాలని లేనిచో పైపాటుగా పిచికారి చేయాలని సూచించారు.
యాసంగి సీజన్లో బోర్ల కింద వరి సాగు చేసుకునే రైతులు నీటి లభ్యతను బట్టి ఆరుతడి పంటలైన పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, ఇతర కూరగాయలు సాగు చేసుకోవాలని సూచించారు. రైతులు బిందు సేద్యంలో ఆయిల్‌పామ్ తోటల పెంపకం కూడా చేపట్టవచ్చన్నారు. దీనికి ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని, వివరాలకు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారిని సంప్రదించాలని తెలిపారు. ఆయన వెంట ఏఓ (టెక్నికల్ ) పి.మల్లేశ్, ఏఈఓ మౌనిక పాల్గొన్నారు.