దేవరకొండ రూరల్, జూన్ 04 : ఈ నెల 12వ తేదీ నుండి పాఠశాలలు పున:ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారించి, మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ దేవరకొండ ఎంఈఓ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి వట్టేపు శివకుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులకు సకాలంలో పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అందించాలన్నారు. అలాగే నాణ్యమైన మధ్యాహ్న భోజనం, సరిపడా మూత్ర శాలలు, మరుగుదొడ్లు, అదేవిధంగా, బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాలన్నారు.
ఒక బ్రాంచ్ పర్మిషన్తో రెండు మూడు బ్రాంచ్ లు నడుపుతున్నారని, ఒలంపియాడ్, టెక్నో, సీబీఎస్ఈ పేర్లు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలకు వేల ఫీజులు వసూలు చేస్తున్నట్లు దుయ్యబట్టారు. ముందస్తు అడ్మిషన్లు చేస్తూ, పర్మిషన్ లేని పాఠశాలలను వెంటనే సీజ్ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. అనుమతి లేని పాఠశాలలో విద్యార్థులను చేర్పించి తల్లిదండ్రులు మోసపోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ సహాయ కార్యదర్శి ఎనిమల సాయి, నాయకులు పల్లె కిరణ్, కలుముల ప్రశాంత్, వినయ్ పాల్గొన్నారు.