నల్లగొండ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రహసనంగా మారింది. లబ్ధిదారుల ఎంపిక నుంచి మొదలు పెడితే నిర్మాణం వరకు వివిధ దశల్లో ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించి ముందుకు సాగే పరిస్థితి లేదు. ఓ వైపు పైలట్ గ్రామాల్లో నేటికీ ముగ్గు పోయని గ్రామాలు ఎన్నో ఉండగా, రెండో విడుతలో భాగంగా మిగతా గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక వివాదస్పదంగా మారుతున్నది. లబ్ధిదారుల ఎంపికలో గ్రామాల్లో కాంగ్రెస్ నేతలకు ప్రాతినిథ్యం కల్పిస్తూ ఏర్పాటు చేసిన కమిటీల జోక్యం మితిమీరడంతో అనర్హులకు అవకాశం దక్కుతున్నది.
నిజంగా సొంత స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా రాజకీయ కోణంలో వారికి జాబితాల్లో చోటు దక్కడం లేదు. తొలి దఫా జాబితా ఎంపికలో క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మెజార్టీ లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉండడం గమనార్హం. దాంతో కొన్నిచోట్ల నిజమైన అర్హులు గ్రామాల్లోని అధికారుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మరికొన్ని చోట్ల రోడ్లపైకి వచ్చి ఇండ్ల జాబితాలపై నిరసనలకు సైతం దిగుతున్నారు. సరైన రీతిలో పర్యవేక్షించాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో సమస్య మరింత జఠిలంగా మారుతున్నది.
ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన దానికి నేడు క్షేత్రస్థాయి పరిస్థితులకు అస్సలు పొంతనే లేదు. ఇందిరమ్మ ఇండ్లతోపాటు మరో మూడు పథకాలను జనవరి 26 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత మండలానిని ఒక పైలెట్ గ్రామానికే పరిమితం చేసిన విషయం తెలిసిందే. ఆ గ్రామాల్లోనూ ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లు పథకం అమలు కొనసాగుతున్నది. గణతంత్ర దినోత్సవం రోజున పైలెట్ గ్రామాల్లో ఎంపిక చేసిన లబ్ధిదారుల సంఖ్యకు ఆ తర్వాత సర్వే చేసి ఫైనల్ చేసిన సంఖ్యకు పొంతనే లేదు.
మంజూరు పత్రాలు అందుకున్న వారిలోనూ సగానికి సగం లబ్ధిదారులను కుదించివేశారు. కొందరు స్థానికంగా ఉండడం లేదని, మరికొందరికి ట్రాక్టర్లు, లారీలు, టాక్సీలు, కార్ల వంటి నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయని పక్కకు పెట్టారు. ఇంటి స్థలం నిబంధనల ప్రకారం లేదనే కారణంతోనూ లబ్ధిదారులను తగ్గించారు. దాంతో ఎంపిక చేసిన లబ్ధిదారుల సంఖ్య భారీగా పడిపోయింది. అందులోనూ ఇప్పటికీ మెజార్టీ సంఖ్యలో ఇండ్ల నిర్మాణమే మొదలు పెట్టలేదు. కనీసం మార్కింగ్ కూడా చేయలేదు. ఇక బేస్మెంట్ వరకు పూర్తి చేసుకున్న వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. వారిలోనూ సగం మందికి కూడా తొలి విడుత లక్ష రూపాయల సాయం అందలేదు.
ప్రారంభంలో లబ్ధిదారులకు అందజేసిన ప్రొసిడింగ్స్లో ఇంటి నిర్మాణ విస్తీర్ణంపై ఇచ్చిన నిబంధనలకు, ప్రస్తుతం కొత్తగా చెప్తున్న వాటికి పొంతన లేకపోవడంతో కొందరు లబ్ధిదారులు అర్ధాంతరంగా అనర్హులుగా మారుతున్నారు. ఇంటి నిర్మాణ విస్తీర్ణం 600 చదరపు అడుగుల దాటవద్దన్న నిబంధనను కొత్తగా చేర్చడంతో ఇప్పటికే అక్కడక్కడా ప్రారంభించిన వారిని అనర్హులుగా తేలుస్తున్నారు. ఇన్ని ఆటంకాల నడుమ ఇందిరమ్మ ఇండ్ల పథకం అసలు ముందుకు సాగుతుందా, మధ్యలోనే ఆగుతుందా అని లబ్ధిదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు లేని సమయంలో ప్రభుత్వం ఇస్తుందన్న ఆశతో మొదలుపెడితే తర్వాత పరిస్థితి ఏంటి ఆందోళన చెందుతున్నారు.
ఇందిరమ్మ కమిటీలతో అనర్హులకు…
పైలట్ గ్రామాల్లో పరిస్థితి నత్తనడకను తలపిస్తుండగా రెండో విడుతలో నియోజకవర్గానికి 3,500 ఇండ్లకు సంబంధించి ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతున్నది. ఏప్రిల్ 30నాటికే తుది జాబితాలు ఖరారు చేయాల్సి ఉండగా, కాంగ్రెస్ నేతలతో కూడిన ఇందిరమ్మ కమిటీలతో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇందిరమ్మ కమిటీల్లో గ్రామస్థాయి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు పెద్దపీట వేయడంతో లబ్ధిదారుల జాబితాపై వారి పెత్తనమే నడుస్తున్నది.
దాంతో గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక వివాదస్పదంగా మారుతున్నది. చాలా చోట్ల జాబితాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, వారికి అనుకూల వ్యక్తులకు మాత్రమే చోటు లభిస్తున్నది. నిజంగా సొంత ఇల్లు లేకుండా ఇంటి స్థలం ఉన్న వారిని సైతం రాజకీయ కోణంలో పక్కన పెట్టిన దాఖలాలు అనేకం ఉన్నాయి. తొలి విడుత జాబితాలో కాంగ్రెస్ మార్క్ స్పష్టంగా కనిపిస్తున్నది. ఎమ్మెల్యేలను సైతం గ్రామ స్థాయి నేతలు ప్రభావితం చేస్తుండడంతో నిజమైన అర్హుల ఎంపికపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఈ క్రమంలో గ్రామాల్లో అసలైన అర్హులు పలుచోట్ల ఆందోళనలకు దిగుతున్నారు. పంచాయతీ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికీ చాలా చోట్ల అర్హుల జాబితాలను బయటకు వెల్లడించడం లేదు. జాబితాలు బయటకు వస్తే గ్రామాల్లో మరింత గందరగోళ పరిస్థితులు నెలకొననున్నాయి. కేసీఆర్ సర్కారులో అన్ని ప్రభుత్వ పథకాల్లోనూ మధ్యలో ఎవరి జోక్యమూ లేకుండా నేరుగా లబ్ధిదారులకే అందేవి.
రైతు బంధు, రుణమాఫీ, కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి ఇలా ఏ పథకం తీసుకున్నా నేరుగా అర్హులైన లబ్ధిదారులకు మేలు జరిగేది. కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీల పేరుతో తమకు అనుకూలమైన వారికే పెద్దపీట వేస్తున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో లబ్ధిదారుల ఎంపిక సమయంలోనే ప్రభుత్వం ఇచ్చే సాయంలో తమ వాటా కోసం కూడా ముందే ఒప్పందాలు చేసుకుని, వాటికి అంగీకరించే వారికే పథకాలు అందేలా కాంగ్రెస్ నాయకులు జాగ్రత్త పడుతున్నట్లు విమర్శలు
వస్తున్నాయి.
పైలట్ గ్రామాల్లో ఇదీ పరిస్థితి…