సూర్యాపేట, జనవరి 10 : ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టిస్తామని, అందుకు అయ్యే ఖర్చులో 5 లక్షల రూపాయలను దశల వారీగా లబ్దిదారులకు అందిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. ఏడాది పాలన పూర్త య్యే సమయానికి పథకానికి రూపకల్పన చేసి ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పథకానికి శ్రీకారం చుట్టింది. సంక్షేమ పథకాల కోసం ప్రజా పాలన పేరుతో దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు విధివిధానాలను రూపకల్పన చేసింది. మొత్తంగా వచ్చిన దరఖాస్తులను మొబైల్ యాప్ ద్వారా పరిశీలించింది. సూర్యాపేట జిల్లాలో 3,09,062 మంది కొత్త ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోగా, ఈ నెల 8 నాటికి జిల్లా వ్యాప్తంగా 2,90,336 దరఖాస్తులను సర్వే చేశారు. జనవరి ఒకటి నాటికే సర్వే పూర్తి చేయాల్సి ఉండగా, ఇంకా సాగుతూనే ఉంది. సంక్రాంతి పండుగ తరువాతే సర్వే పూర్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
జిల్లాలో 26 మండలాల పరిధిలోని 475 గ్రామ పంచాయతీలు, వాటి ఆవాసాలతోపాటు 5 మున్సిపాలిటీల్లో సర్వే చేస్తున్నారు. మొత్తం 3,09,062 దరఖాస్తులు రాగా, 5 మున్సిపాలీల్లో 58,377 దరఖాస్తులు అందాయి. మిగిలిన 2,50,685 దరఖాస్తులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాయి. గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు, కొన్నిచోట్ల జూనియర్ అసిస్టెంట్ల ద్వారా సర్వే చేయిస్తున్నారు. మున్సిపాలిటీల్లో వార్డు అధికారులు, ఆర్పీలు చేస్తున్నారు. వీరు క్షేత్ర స్థాయిలో యాప్లో అడిగిన వివరాలను నమోదు చేస్తున్నారు. సర్వే అనంతరం ప్రభుత్వం నిబంధనల ప్రకారం వడపోయనున్నారు. అనంతరం అర్హుల జాబితాను విడుదల చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు పెద్ద ఎత్తున్న దరఖాస్తులు రిజెక్ట్ అవుతాయని క్షేత్రస్థాయి సిబ్బంది, సర్వేలో పాల్గొన్న వారు చెప్పుకొంటున్నారు. 30 శాతం కంటే ఎక్కువ మందికి ఇళ్లు వచ్చే అవకాశం లేదంటున్నారు.