రామగిరి (నల్లగొండ), మార్చి 12 : పట్టణాల్లో భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలని ఇందుకోసం 2025-26 బడ్జెట్లో నిధులు కేటాయించాలని సీపీఎం నల్లగొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.12,000 (రెండు దశల్లో ఒక్కొక్కరికి రూ.6,000) అందించనున్న విషయం తెలిసిందే. బుధవారం పట్టణంలోని 17వ వార్డు ఆర్జాలబావి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరుతూ లేఖపై పట్టణ పేదలతో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టి 20 రోజులు పనికి వెళ్లిన భూమిలేని పేద వారికి సంవత్సరానికి రూ.12,000 వారి ఖాతాలో వేయడం జరుగుతుందన్నారు. 2013కు పూర్వం నల్లగొండ పట్టణంలో ఏడు గ్రామ పంచాయతీలు విలీనం చేశారని దాని ద్వారా ఉపాధి హామీ పని కోల్పోవడం జరిగిందన్నారు. దాంతో వారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పొందలేకపోతున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం పట్టణాల్లో విలీనం చేసిన గ్రామాలు, వ్యవసాయ ఆధారిత శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయడానికి 2025-26 బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 16వ తేదీ వరకు సంతకాల సేకరణ ఉంటుందని, 20న రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం, 24, 25 తేదీల్లో ఆర్డీఓ కార్యాలయం ముందు రిలే దీక్షలు, 28న జిల్లా కలెక్టరేట్ ముందు మహాధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పేదల సంఘం నాయకులు సుకన్య, దేవకి, పార్వతమ్మ, సైదమ్మ, ఝాన్సీ రాణి, రత్నమ్మ ,లక్ష్మమ్మ పాల్గొన్నారు.