భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జెండాలు ఎగురవేసి వందనం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నల్లగొండ పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సూర్యాపేటలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొని జాతీయ జెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పలు ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించడంతోపాటు ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.
నల్లగొండ, ఆగస్టు 15 : త్యాగాల నల్లగొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ముందున్న మొదటి లక్ష్యమని, అందుకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుదామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆయన జాతీయ జెండావిష్కరణ చేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత ఆయన జిల్లా అభివృద్ధి, పలు ప్రభుత్వ కార్యక్రమాలపై ఆయన మాట్లాడారు. నల్లగొండకు టన్నెల్ ద్వారా సాగు నీరు అందించాలనే ఉద్దేశంతో తాను అమెరికాకు వెళ్లి రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మిషన్ తయారీ కంపెనీతో ఒప్పందం చేసుకొని వచ్చానన్నారు. మూసీ నీటిలో పలు రోగాలకు కారణమైన కొలిఫాం బ్యాక్టీరియా ఉన్నందువల్ల మూసీని ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. నల్లగొండలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణం పూర్తి చేసి ప్రతియేటా లక్షల మందికి ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగ దారులకు జీరో బిల్లులు అమలు చేస్తున్నామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య పరిమితి రూ.10లక్షలకు పెంచామని, త్వరలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతామని చెప్పారు. 1.71లక్షల మంది రైతులకు రుణమాఫీతో నల్లగొండ జిల్లా రికార్డు సాధించిందన్నారు. ఏఎమ్మార్పీ ఎస్ఎల్బీసీ ద్వారా హైలెవల్, లోలెవల్ కాల్వలకు నీరు ఇవ్వడంతోపాటు ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా నీళ్లు ఇవ్వడానికి డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నెట్వర్క్ సిస్టమ్‌ను చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 2.98 లక్షల మంది రైతులకు రైతు బీమా అమలు చేయడంతోపాటు ఎకరాకు రూ.15వేల రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎస్ఎల్బీసీలో 42 ఎకరాల్లో ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణం పనులు జరుగుతున్నాయని, నర్సింగ్ కళాశాల నిర్మాణానికి రూ.5కోట్లు కేటాయించామని చెప్పారు. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ బడుల అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధుల కేటాయింపు, ఎంజీయూలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. ఎన్‌హెచ్-65పై ప్రమాదాల నివారణకు ఆరులైన్లుగా మార్చడానికి రూ.541 కోట్లు కేటాయించామని, త్వరలో పనులు చేపడుతామని తెలిపారు. శాంతి భద్రతలను కాపాడడంతో పాటు డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేసి, స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, ఎస్పీ శరత్‌చంద్రపవార్, అదనపు కలెక్టర్లు పూర్ణచంద్ర, శ్రీనివాస్, డీఆర్వో రాజ్యలక్ష్మి, ఏఎస్పీ రాము లు నాయక్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
సూర్యాపేట, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్య్ర దినోత్సవం అని, ఆ ఫలాలు అందరికీ పంచాలనేది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పేదల సంక్షేమం కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలైనా ఖర్చు చేసేందుకు వెనుకాడే ప్రసక్తే లేదని తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ సన్ ప్రీత్‌సింగ్‌తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ జిల్లా ప్రగతి, ప్రభుత్వ పథకాలపై మాట్లాడారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటివరకు జిల్లాలో 1.29కోట్ల మంది మహిళలు ప్రయాణించారని, వీరికి రూ.66.84 కోట్లు ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జిల్లాలో 19,096మంది చికిత్స పొందారని తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఒక్కో ఇంటికి రూ. 5లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు చెప్పారు. రూ.500 వంట గ్యాస్ సిలిండర్‌ను ఇప్పటి వరకు జిల్లాలో 1.48లక్షల మందికి అందించామన్నారు.
గృహజ్యోతి పథకం కింద జిల్లాలో 1.75లక్షల కుటుంబాలకు రూ.28.5 కోట్ల ఉచిత విద్యుత్‌ను ఇచ్చామని తెలిపారు. జిల్లాలో రెండు విడుతల్లో కలిపి 82,593 మంది రైతులకు రూ.573కోట్ల రుణమాఫీ జరిగిందని చెప్పారు. జిల్లాలో రూ.519.77కోట్లతో ఎత్తి పోతల పథకాలు ఏర్పాటు చేస్తున్నామని, రూ.418 కోట్లతో నాగార్జునసాగర్ ఎడమ కాల్వను ఆధునీకరించామని తెలిపారు.రూ.144కోట్లతో మూసీ ప్రాజెక్టు కాల్వలు ఆధునీకరించామని, రూ.244.45 కోట్లతో 20చెక్ డ్యామ్‌లు నిర్మిస్తున్నామని అన్నారు. ధరణిలో 56,266 దరఖాస్తులు వచ్చాయని, 94శాతం పరిష్కరించామని తెలిపారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా 2.62లక్షల మందికి జాబ్‌కార్డులు ఇచ్చామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసులు అనుక్షణం పని చేస్తున్నారని, గంజాయి, ఇతర నార్కోటిక్ డ్రగ్స్ పదార్థాలపై ఉక్కుపాదంతో అణచివేయాలని సూచించారు. స్వాతంత్య్ర సమరయోధులైన సూర్యాపేటవాసులు అంజయ్య, జానకిరాములు, గరిడేపల్లి నివాసి పుల్లారెడ్డిని మంత్రి ఉత్తమ్ సన్మానించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. రూ.52.44 కోట్ల చెక్కును స్వయం సహాయం సంఘాలకు, రూ.35.36కోట్ల చెక్కును మెప్మా సిబ్బందికి అందజేశారు. ఉత్తమ ఉద్యోగులకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వర్రావు, ఆర్డీఓ వేణుమాధవ్, జడ్పీ సీఈఓ అప్పారావు, డీపీఓ యాదగిరి, డీడబ్ల్యూఓ నరసింహారావు, డటీడీఓ శంకర్, డీఈఓ అశోక్, ఉద్యోగులు పాల్గొన్నారు.