రామగిరి, నవంబర్ 3:ప్రైవేట్ కళాశాలల్లో విద్య నభ్యసిస్తున్న పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ ఎంజీయూ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలు, బీఈ డీ, ఎంఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కళాశాలల యాజమాన్యాలు కళాశాలల నిరవధిక బంద్ పాటిస్తున్నాయి. సోమవారం నుంచి తరగతులతోపాటు కళాశాలల బంద్ చేపట్టాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాజమాన్యాలు బంద్ పాటిస్తూ ఆయా కళాశాల ఎదుట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి.
ఫ్రభు త్వం స్పందించి సమస్య పరిష్కరించే వరకు బహిష్కరణ కొనసాగుతుందని ఎంజీయూ టీపీడీపీఎంఏ, ఎంజీయూ ప్రైవేట్ బీఈడీ కళాశాలల అసోసియేషన్, ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలు నిర్ణయించాయి. దీంతో తొలి రోజు బంద్ ప్రశాతంగా సాగింది. ఈ సందర్భంగా ఆయా కళాశాలల యాజమాన్యాల నేతలు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని కళాశాలలు బంద్ పాటిస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రభుత్వం మంజూరు చేసే ఫీజు రీయింబర్స్మెంట్పై ఆధారపడి విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలలు ఉచితంగా విద్యా బోధన చేస్తున్నాయి.
అయితే అందుకయ్యే ఖర్చులను ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు భరిస్తూ గత ముడేళ్లుగా కళాశాలలను నెట్టుకుంటూ వస్తున్నాయి. రీయింబర్స్మెంట్ విడుదల విషయంలో సర్కార్ జాప్యం చేస్తుండటంతో యాజమాన్యాలు అధ్యాపకుల జీతాలు, భవనాల అద్దెలు, కరెంటు బిల్లులు, యూనివర్సిటీ రుసుంలు, బిల్డింగ్ టాక్స్ చెల్లించేందుకు అవస్థలు పడుతున్నాయి. అప్పు చేసి చెల్లిస్తున్నామని, పాత అప్పులకు వడ్డీలు చెల్లించలేక, కొత్త అప్పులు పుట్టక అధ్యాపకులకు, భవనాల యా జమానులకు సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు.
నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్, మారం నాగేందర్రెడ్డి, కాకతీయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి, డీవీఎం, అరబిందో, అల్ మదీనా, గోకుల్ కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు చొల్లేటి శ్రీధరాచారి, నారాయణరెడ్డి, తాటి శ్రీనివాస్, అహ్మద్ హుస్సేన్, శరత్చంద్ర, సిద్ధిఖీ, సిద్ధార్థ డిగ్రీ కళాశాల అకడమిక్ డైరెక్టర్ జానయ్య యాదవ్, చైర్మన్ లింగయ్య పాల్గొన్నారు.