నేరేడుచర్ల, జూలై 13 : శ్యామ్ అనే విద్యార్థి ఓ ప్రైవేటు పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఆ విద్యార్థి బరువు 25 కిలోలు. పుస్తకాల బరువు 13 కిలోలు, లంచ్ బాక్స్, స్నాక్స్, వాటర్ బాటిల్ అదనం. అంటే తన బరువులో సగం పైగా ఉన్న పుస్తకాలను ఆ బాలుడు మోస్తున్నాడు. వీటిన భుజాన వేసుకుని మూడు నాలుగు అంతస్తులు ఉన్న తరగతి గదిలోకి వెళ్లేందుకు ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఎన్నో కార్పొరేట్, ప్రేవేటు పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. బడి బ్యాగ్ …విద్యార్థుల పాలిట గుదిబండగా మారుతోంది. ఆటపాటలతో హుషారుగా స్కూల్కు వెళ్లాల్సిన విద్యార్థులు శక్తికి మించిన బరువు మోయడంతో ఉసూరుమంటున్నారు.
ఆటపాటతో సరదాగా కబర్లు చెప్పుకుంటూ బడికి చేరాల్సిన చిన్నారులు నీరసంగా నడుస్తున్నారు. బడి నుంచి ఇంటికి చేరి సాయంత్రం అమ్మ బడిలో కూర్చొని గోరుముద్దలు తింటూ కబుర్లు చెప్పాల్సిన పిల్లలు ఒళ్లు నొప్పులతో ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా పాఠశాలల మధ్య పోటీతో పాఠాలు, రాత, నోటు బుక్స్, హోంవర్క్ తదితర పుస్తకాల సంఖ్యను విచ్చలవిడిగా పెంచేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ విషయంలో తల్లిదండ్రలు కూడా స్పందించడం లేదు. ఫలితంగా శక్తికి మించిన బరువు మోస్తూ బాల్యం నలిగి పోతుంది.
సీసీఈతో పెరిగిన బరువు
నిరంతర సమగ్ర మూల్యాంకనం అమ లు చేస్తుండడంతో గతంలో కంటే 30 శాతం పుస్తకాల బరువు పెరిగిందని ఉపాధ్యాయులే చెబుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు పాఠశాలల్లో అదనపు భారం వేస్తున్నారు. గతంలో విద్యార్ధికి సరాసరి 18 పుస్తకాలతో పాటు రాత పుస్తకాలు ఉండేవి. తాజాగా ఈ సంఖ్య దాదాపు 40కి చేరుకుంది. ఇందులో హోంవర్కు, స్లిప్ టెస్ట్, రఫ్ నోట్స్, ప్రాజెక్టు వర్క్, ఎస్సే రైటింగ్ అదనం. ఒక పాఠశాలను చూసి మరో పాఠశాల యజమాన్యం నోటు పుస్తకాల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నాయి.
యశ్పాల్ కమిటీ నిబంధనలు ఇలా..
విద్యార్థుల బ్యాగుల భారం తగ్గించాల్సిందేనని జస్టిస్ యశ్పాల్ కమిటీ 1993లో సూచించింది. ఈ మేరకు పుస్తకాల బరువు విద్యార్థుల బరువులో 10 శాతానికి మించి ఉండకూడదు. ప్రాథమిక స్థాయిలో 1800 గ్రాములు నుంచి 3.5 కేజీలు మధ్య ఉండాలని చెప్పింది. ఈ నివేదిక వచ్చి రెండు దశాబ్ధాలు దాటుతున్నా ఇంతవరకూ విద్యాశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. 2006 విద్యాచట్టం ప్రకారం ఏయే తరగతుల విద్యార్థులకు ఎంత మేర పుస్తకాల బరువు ఉండాలో స్పష్టంగా చెప్పింది. విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడూ తనిఖీలు చేస్తూ బరువు భారం మించకుండా చూడాలని ప్రభుత్వం నిర్ధేశించినా క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదు.
పిల్లల వెన్నెముకపై ప్రభావం
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతన్న విద్యార్థులకు ఆరు సబ్జెక్టులకు సంబంధించి ఆరు పుస్తకాలు, నోటు పుస్తకాలు ఉంటాయి. అయితే ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం అందుకు విరుద్ధంగా యాజమాన్యాలు ఒకటి, రెండు తరగతులు చదివే విద్యార్థులకు 10 నుంచి 15 పుస్తకాలు, ఒక్కో సబ్జెక్టుకు తరగతి హోంవర్కు, ప్రాజె క్టు వర్కు ఇలా మూడేసి పుస్తకాలు కొనుగోలు చేయాలని ఆదేశిస్తున్నాయి. దీంతో మొత్తం 30 నుంచి 45 పుస్తకాలతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు పలు పబ్లికేషన్లు రూపొందించిన పాఠ్యపుస్తకాలనే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో చేసేదేమీలేక తల్లిదండ్రులు వారు చెప్పే పుస్తకాలన్నింటినీ కొనుగోలు చేసి విద్యార్ధి బ్యాగుల్లో ఉంచి స్కూలుకు పంపుతున్నారు. వీటికి లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, తోడవుతండటంతో బరువు మరింత పెరుగుతోంది. దీంతో విద్యార్థు అనారోగ్యం బారిన పడుతున్నారు. బరువు మోయలేక అవస్థలు పడుతున్నారు.
శారీరక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం
విద్యార్థుల వారి శరీర బరువు కంటే 10 శాతం ఎక్కువ బరువును తరచుగా మోస్తే అనేక సమస్యలు ఎదురవుతాయి. చిన్నతనంలోనే మెడ, నడుము, వెన్ను, తల నొప్పులు వస్తాయి. ఒత్తిడి పెరగడంతో మానసిక రుగ్మతలు సైతం తలెత్తుతాయి. దీనినే రెఫరల్ పెయిన్ అం టారు. ఇది ఆ చిన్నారి శరీరక పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఇలా చేస్తే మేలు..
చట్టం ఏం చెబుతోంది..
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు
తరగతి : బరువు(కిలోల్లో)
ప్రీ నుంచి యూకేజీ : బరువు ఎత్తుకోకూడదు
1 నుంచి 2వ తరగతి : 1.5 కిలోలు
3 నుంచి 5వ తరగతి : 2నుంచి 3కిలోలు
6,7 తరగతులకు : 4 కిలోలు
8,9 తరగతులకు : 4.5 కిలోలు
10వ తరగతికి : 5 కిలోలు