కట్టంగూర్, జూన్ 24 : జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్డు లేకపోవడంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కట్టంగూర్ మండల కేంద్రంలో సర్వీస్ రోడ్డు కురుమర్తి క్రాస్ రోడ్డు వరకు నిర్మించాల్సి ఉన్నా హైవే అధికారులు బస్టాండ్ వరకు నిర్మించి వదిలేశారు. దాంతో సర్వీస్ రోడ్డు నిర్మాణానికి వదిలేసిన స్థలం నిరుపయోగంగా ఉంది. ప్రజలు, వాహనదారులు అపసవ్య దిశలో వెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా ఎన్హెచ్ఏఐ అధికారులు పట్టించుకోవడం లేదు.
ప్రతి శనివారం కట్టంగూర్‌లో జరిగే వారసంతకు ఇందిరమ్మ, పద్మశాలి కాలనీల ప్రజలతో పాటు కురుమర్తి నుండి వచ్చే వాహనదారులు ప్రజలు, రాత్రి పూట ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అపసవ్య దిశలో వెళ్తూ భయాందోళన చెందుతున్నారు. హైవే అధికారులు సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.