నల్లగొండ రూరల్, ఆగస్టు 16 : సంవత్సరాలు గడిచినా బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ నేటికీ పూర్తి కాకపోవడం సిగ్గుచేటని, అసంపూర్తిగా వదిలేసిన కాల్వల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండ మండలం అప్పాజీపేట గ్రామంలో అసంపూర్తిగా వదిలేసిన కాల్వలను సీపీఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రాజెక్టులను పూర్తి చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులను గాలికి వదిలేసి గాలి మోటారులో తిరుగుతున్నారన్నారు. శ్రీశైలం స్వరంగ మార్గం పూర్తి చేస్తామని చెప్పి, కనీసం చనిపోయిన వ్యక్తుల శవాలను కూడా బయటకు తీయలేని దుస్థితి నెలకొన్నదని విమర్శించారు.
బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ క్రింద కాల్వలు ఒక్కటి కూడా పూర్తి చేయలేదని, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అసమర్థత వల్లే కాల్వలు పూర్తి కావడం లేదని దుయ్యబట్టారు. ఎస్ఎల్బీసీ కింద పిల్ల కాల్వలను వెంటనే పూర్తి చేసి రైతుల పంట పొలాలకు నిరంధించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున, జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, మండల కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ, కొండ వెంకన్న, బొల్లు రవీందర్, మచ్చా యాదయ్య, రైతులు మచ్చ యాదయ్య, పందుల భిక్షం, దొడ్లపాటి ప్రతాపరెడ్డి, నాంపల్లి యాదయ్య, ఈర్ల నాగేశ్, పీర్ల రాంబాబు, దొడ్లపాటి నర్సిరెడ్డి, దైద భూషణ్ రెడ్డి, కాసర్ల రమాశంకర్, ఎరకలి నరసింహ పాల్గొన్నారు.