చిట్యాల, ఆగస్టు 12 : మండలంలోని వెల్మినేడులో ఫార్మాసిటీ ఏర్పాటు చేయనున్నారని మీడియాలో కథనాలు వస్తుండటంతో ఆ ప్రాంతానికి చెందిన రైతులు, ప్రజ లు అందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న ఫార్మా కంపెనీల వల్ల పంట పొలాలు దెబ్బతిని రైతులు, కాలుష్యాన్ని తట్టుకోలేక ప్రజలు ఇబ్బంది పడుతుండగా ఏకంగా ఫార్మాసిటీని నిర్మిస్తారని ప్రచారం జరుగుతుండటంతో స్థానికుల్లో కలవరం మొదలైంది.
గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం ముచ్చర్లలో పెద్దఎత్తున భూసేకరణ చేసింది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానంతో ఆ ప్రాంతంలో ఫార్మాసిటీని రైతులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా ఒకే ప్రాంతంలో ఫార్మాసిటీ నిర్మిస్తే వ్యతిరేకత వస్తున్నందున రాష్ట్రంలోని దాదాపు 10 ప్రాంతాల్లో ఫార్మాసిటీలను నిర్మించటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా నల్లగొండ జిల్లాలోని వెల్మినేడులో ఫార్మాసిటీని నిర్మించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రాంతమైతే ప్రభుత్వ ఆలోచనా విధానాలకు అనుగుణంగా ఉండటంతో ఇక్కడే ఫార్మాసిటీ నిర్మిస్తారని అంటున్నారు. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు దగ్గరలో, దేశంలోని ప్రధాన రహదారులలో ఒకటైన 65 నంబర్ జాతీయ రహదారిని ఆనుకొని ఉండటం, ఇప్పటికే ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్కు కోసం భూసేకరణ జరుగడం వంటివి ప్రభుత్వానికి అనుకూలించే విషయాలు.
గతంలో డ్రైపోర్టు, ఇండస్ట్రియల్ పార్కుకు సన్నాహాలు
మొదట ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూముల్లో డ్రైపోర్టు నిర్మిస్తారని ప్రచారం జరిగినప్పటికీ తదుపరి ఇండస్ట్రియల్ పార్కు కోసం అని ఈ ప్రాంతంలో ఉన్న 162.28 ఎకరాల ప్రభుత్వ భూమికి ఆనుకొని గతంలో రైతులకు పంపిణీ చేసిన 313 ఎకరాల భూమిని కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. ఇందు కోసం సర్వే చేయడానికి అధికారులు వెళ్లగా ఆ ప్రాంతానికి చెందిన రైతులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రక్రియ అక్కడితో నిలిచిపోయింది.
ఇదే ప్రాంతంలో మరికొంత భూమిని సేకరించి ఇండస్ట్రియల్ పార్కు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నప్పటికీ స్థానిక అధికారులు మాత్రం తమకు ఎలాంటి సమాచారం లేదని అంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే వెల్మినేడు, పిట్టంపల్లి గ్రామాల మధ్య ఉన్న కెమికల్ కంపెనీలు వెదజల్లుతున్న కాలుష్యంతో ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుండగా జీవాలు కూడ అనారోగ్యం బారిన పడుతున్నాయి.
పంటపొలాలు దెబ్బతింటుండటంతో రైతులు, ప్రజలు పలు సందర్భాలలో ఆందోళనలు నిర్వహించారు .కాగా కొత్తగా ఫార్మా సిటీ నిర్మిస్తే పదుల సంఖ్యలో ఫార్మా కంపెనీలు వస్తాయని, జనజీవనం పూర్తిగా దెబ్బతింటుందని పలువురు పేర్కొంటున్నారు. ఇటాంటి ఆలోచనను ఆరంభంలోనే వ్యతిరేకించాలని పలువురు పర్యావరణ ప్రేమికులు తెలియజేస్తున్నారు.
ఫార్మాసిటీ వస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తాం
ఈ ప్రాంతంలో ఫార్మాసిటీని నిర్మిస్తే ప్రజలు, రైతుల సహకారంతో తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న కంపెనీలతో కాలుష్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఆ కంపెనీలు కాకుండా కొత్త కంపెనీలు వస్తే వాటిని ఏర్పాటు చేయకుండా ప్రతిఘటిస్తాం. ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తామన్న ప్రాంతంలో కాలుష్య రహిత కంపెనీలే నిర్మించాలి.
-దేవరపల్లి సత్తిరెడ్డి, వెల్మినేడు మాజీ ఎంపీటీసీ
కలెక్టర్ ఉత్తర్వులు రాలేదన్నారు
ఫార్మాసిటీ నిర్మాణంపై వస్తున్న వార్తల నేపథ్యంలో కలెక్టర్‌ను కలువగా అలాంటిదేమీ లేదని చెప్పారు. భూ సేకరణకు కూడా ఉత్తర్వులు రాలేదన్నారు. ఒకవేళ ఈ ప్రాంతంలో ఫార్మాకంపెనీ వస్తే రైతు శ్రేయస్సు కోసం వ్యతిరేకిస్తాం.
-బొంతల చంద్రారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు
ఎలాంటి ఆదేశాలు రాలేదు
కొత్తగా భూ సేకరణ కోసం మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. గతంలో ఉన్న ఉత్తర్వుల ప్రకారం అప్పట్లో భూ సేకరణ కోసం సర్వే నిర్వహించడానికి వెళ్లగా రైతులు వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
-డి. కృష్ణ, చిట్యాల తాసీల్దార్