గుడిపల్లి, మార్చి 17 : గుడిపల్లి మండల కేంద్రంలో, సింగరాజుపల్లి గ్రామంలో విద్యుత్తు వైర్లను ఆనుకొని స్తంభాలు ఉన్నాయి. ఈ విద్యుత్తు తీగల కింద నుంచి వెళ్తుండటంతో ఎప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనంటూ మండల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అయినప్పటికీ విద్యుత్తు శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. విరిగిన కరెంటు స్తంభాలు ఊరిని ఆనుకోని ఉండటంతో నిత్యం స్థానిక ప్రజలు, మూగ జీవాలు ఆ దారి వెంట వెళ్తూ ఉంటా యి.
గాలులతో కూడిన వర్షాలు వస్తే ఏం ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గతంలో సింగరాజుపల్లికి వచ్చినప్పుడు స్థానికులు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. అయన వెంటనే అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ నేటి వరకు సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు వాపోతున్నారు. సింగరాజుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఊరిలోని బజారు మధ్యలో కరెంటు స్తంభాలు ఉన్నాయి. ఇటు గుండా ఆటోలు, ట్రాక్టర్లు వెళ్లే సమయంలో ఇబ్బందులు వస్తున్నాయి. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.