నల్లగొండ ప్రతినిధి, జూలై30(నమస్తే తెలంగాణ) : రుణమాఫీ అమలులో ఆర్థికంగా సాధ్యమైనంత వరకు భారం తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తన కుయుక్తులను కొనసాగిస్తున్నది తొలి విడుత మాదిరిగానే రెండో విడుతలోనూ రకరకాల కారణాలను చూపుతూ లబ్ధిదారుల సంఖ్యను అంతకంతకూ కుదించే ప్రయత్నాలు చేసినట్లు స్పష్టం అవుతుంది.
లేదూ లేదంటూనే రేషన్‌కార్డు ప్రామాణికంగా కుటుంబాన్ని లెక్కిస్తూ ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రెండు లక్షల రుణమాఫీ అమలయ్యేలా చర్యలు చేపట్టింది. దీంతో లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గిపోతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండో విడుతలోనూ సగానికి సగం రైతుల అడ్రస్సు గల్లంతైనట్లు తెలుస్తున్నది.
మంగళవారం మధ్యాహ్నం రెండో విడుత రుణమాఫీలో రూ.లక్షన్నర వరకు అమలు చేస్తున్నట్లు ప్రకటించినా పూర్తి వివరాలు రైతుల వద్దకు చేరలేదు. సహకార సంఘాల లబ్ధిదారుల జాబితాలపై రాత్రి వరకు స్పష్టత రాకపోగా ఇతర బ్యాంకర్లు కూడా నేటి నుంచి దీనిపై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం తరఫున జాబితా వెల్లడైనా బ్యాంకుల వద్దకు వెళ్తేగానీ తెలువనున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండో విడుతలో మొత్తం 82,020 మంది రైతులకు గానూ రూ.947.43 కోట్ల రుణాలు మాఫీ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తొలి దఫాలో రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం రెండో విడుతలో లక్షన్నర లోపు ఉన్న రైతులకు మాఫీ చేస్తున్నట్లు జాబితాలు వెల్లడించింది. దీంతో రెండు విడుతల్లో కలిపి కూడా ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,57,162 మంది రైతులకు గానూ రూ.1880.25 కోట్లు మాత్రమే రుణాలు మాఫీ అయ్యాయి.
వాస్తవంగా ప్రభుత్వం చెప్పిన విధంగా పట్టాదారు పాసుపుస్తకం ఉన్న ప్రతి రైతుకూ రుణమాఫీ అమలు చేస్తే ఐదు లక్షల మంది రైతుల వరకు లబ్ధిదారులుగా ఉంటారని రైతుసంఘాల నేతలు పేర్కొంటున్నారు. కానీ ప్రభుత్వం కొర్రీల మీద కొర్రీలు పెడుతూ రేషన్‌కార్డు ఆధారంగా కుటుంబాన్ని లెక్కలోకి తీసుకోవడం వల్ల ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కనీసం రెండు లక్షల మంది రుణమాఫీకి దూరం అవుతున్నారని చెబుతున్నారు. ఇందుకు ఆధారంగా గతేడాది ఆగస్టులో కేసీఆర్ సర్కార్ చేసిన రుణమాఫీ లెక్కలను ముందుకు తెస్తున్నారు.
అప్పట్లో కేసీఆర్ సర్కార్ పాసుపుస్తకం ఆధారంగా రుణమాఫీ చేయడం వల్ల పెద్ద ఎత్తున రైతులకు లబ్ధి జరిగిందన్నది వాస్తవం. ఎటువంటి షరతులు లేకుండా అమలు చేయడం వల్ల 99,999 రూపాయల వరకు రుణమాఫీ చేస్తేనే భారీ మొత్తంలో రైతులకు రుణాల నుంచి ఉపశమనం కలిగిందని అప్పటి లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ చేసిన రుణమాఫీతో గతేడాది ఆగస్టులో ఉమ్మడి జిల్లాలో 4,00,518 మంది రైతులకు రుణమాఫీ వర్తించింది. మొత్తం రూ.2159.77 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి.
అంటే ఇది లక్షకు ఒక్క రూపాయి తక్కువ ఉన్న రుణాల వరకే కావడం విశేషం. కానీ ప్రస్తుతం లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేసినా రెండు విడుతల్లో కలిపి 2.57లక్షల మంది రైతులకే మేలు జరుగుతుంది. అంటే భారీ ఎత్తన వడపోత చేస్తూ కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ వర్తించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. రేషన్‌కార్డులో ఎంత మంది ఉన్నా ఒక కుటుంబంలో గరిష్టంగా రెండు లక్షల రుణమాఫీ మించవద్దని ప్రభుత్వ ఆదేశాలుగా బ్యాంకర్లు, సహకార సంఘాల అధికారులు చెబుతున్నారు. ఇక రేషన్‌కార్డు లేని వాళ్లకు తొలి దఫాలోనే రుణమాఫీ వర్తించలేదు. రెండో దఫా సంగతి గురించి చెప్పేదే లేదన్నట్లుగా ఉంది. ఇలా వీలైనంత ఎక్కువమంది రైతులను తగ్గించడమే లక్ష్యంగా రుణమాఫీని అమలు చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
నేడు మరింత స్పష్టత
రెండో దఫా రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్యపై నేడు మరింత స్పష్టత రావచ్చిని తెలుస్తున్నది. మంగళవారం చాలా సొసైటీల్లో జాబితాలు రాత్రి వరకు వెల్లడికాలేదు. ఇక సోమవారం రాత్రి వరకు వ్యవసాయ అధికారులకు వచ్చిన లెక్కలకు… తీరా మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వం వెల్లడించిన లెక్కలకు పొంతన లేకుండా పోయింది. ఒక్క నల్లగొండ జిల్లానే పరిశీలిస్తే… వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం సోమవారం రాత్రి 83,649 మంది రైతులకు రెండో విడుతలో మాఫీ జరుగాల్సి ఉంది. వీరికి గానూ రూ.1014.68 కోట్ల రుణాలు మాఫీ కానున్నట్లు మీడియాకు వివరాలు పంపారు.
తీరా మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వం నుంచి వచ్చిన లెక్కలు సగానికి సగం తగ్గిపోయాయి. ఒక్క రాత్రిలోనూ నల్లగొండ జిల్లాలో 43వేల మంది రైతులకు రూ.503.89 కోట్ల మేర మాత్రమే రుణమాఫీ వర్తించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంటే దాదాపు 40వేల మంది రైతులు తగ్గిపోయారు. దీనిపై వివరణ అడిగితే అధికారుల కూడా స్పష్టంగా ఏమీ చెప్పలేకపోతుండడం గమనార్హం. రైతుల వారీగా నేడు రేపు బ్యాంకులకు వెళ్తే వాస్తవ లబ్ధిదారుల సంఖ్యపై అంచనా రానుంది. దీంతో పాటు సహకార సంఘాల్లోనూ రైతుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. దీని అనంతరమే రైతులు, రైతుసంఘాల నేతలు మరింత స్పష్టంగా స్పందించాలన్న యోచనతో ఉన్నారు.
మా ఇంట్లో ఇద్దరం రుణం తీసుకున్నామని మాఫీ చేయలేదు
తండ్రి కొడుకులం ఇద్దరం కలిసి రెండు పాసుబుక్కులు బ్యాంక్‌లో పెట్టి మూడు లక్షల రుణం తీసుకున్నాం. రుణమాఫీ వస్తుందని ఎంతో సంతోషం పడ్డాం. రెండు మాఫీ జాబితాల్లో పేర్లు రాకపోవడంతో నిరాశతో ఉన్నాం. బ్యాంకు, వ్యవసాయాధికారులను అడిగితే ఒకే కుటుంబంలో ఇద్దరు రుణం తీసుకోవడంతో మాఫీ కాలేదని చెప్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందేమో అధికారంలో రాగానే ఇంట్లో ఎంత మంది రుణం తీసుకున్నా మాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో రేషన్ కార్డును ప్రామాణికం తీసుకుంటున్నరు. లక్ష రూపాయలు కడితే తప్ప రుణమాఫీ కాదంటున్నారు. నిబంధనలు పెట్టి మాలాంటి రైతులకు రుణమాఫీ చేయకుండా అన్యాయం చేస్తున్నారు. కాంగ్రెసోళ్ల మాటలు విని మోసపోయాం.
– బొంగోని ఉప్పలయ్యగౌడ్, రైతు, నర్సాపురం, రాజాపేట మండలం
రేషన్ కార్డు లేక మాఫీ కాలేదు
నాకు ఈదులూరులో 4.32 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. నేను 2023 డిసెంబర్ లోపు ఈదులూరు గ్రామీణ వికాష్ బ్యాంకులో రూ.86 వేలు క్రాప్‌లోన్ తీసుకున్న. ఇప్పుడు అసలు, వడ్డీతో కలుపుకొని మొత్తం ఒక లక్షా రెండు వేల రూపాయలు అయ్యింది. కానీ లక్షన్నర లోపు రుణ మాఫీలో నా పేరు లేదు. అధికారులను సంప్రదిస్తే రేషన్ కార్డు లేకపోవడంతో ఇప్పుడు మాఫీ కాలేదని చెబుతున్నారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా రాలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎలాంటి షరతులు తేకుండా మాఫీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనల పేరుతో రైతులను అన్యాయం చేస్తున్నది. రేషన్ కార్డు ప్రామాణికం కాకుండా పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగా రుణమాఫీ చేయాలి.
– గద్దపాటి సంగీత, ఈదులూరు, కట్టంగూర్ మండలం