రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నాలుగు పథకాల ప్రారంభ కార్యక్రమంలో పలు చోట్ల రగడ నెలకొంది. అర్హులకు పథకాలు దక్కలేదాంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి. అనర్హులకు ఎలా పథకాలు కట్టబెట్టారాంటూ నిలదీశారు. ఉన్నోళ్ళకే రెండేసి పథకాలు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తమకు అన్యాయం జరిగిందంటూ పలువురు మహిళలు కంట తడి పెట్టుకున్నారు.
రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆదివారం జిల్లాలోని 17గ్రామాల్లో సంక్షేమ పథకాల అమలు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. లబ్ధిదారులకు పథకాల మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను అందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎంపిక చేసిన ప్రతి గ్రామంలోనూ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి మండలంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. వలిగొండ మండలం నాతాళ్లగూడెం గ్రామంలో ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతు రావు హాజరయ్యారు. యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పథకాలకు శ్రీకారం చుట్టారు. రామన్నపేట మండలం ఉత్తటూర్లో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు.
జిల్లాలో నాలుగు పథకాలకు సంబంధించి 17 గ్రామాల్లో లబ్ధిదారుల వివరాలను అధికారులు వెల్లడించారు. రైతు భరోసా కింద 8,961 మందికి లబ్ధి చేకూరింది. 17,644 మందికి రైతులకు సంబంధించి 44,905.19 ఎకరాలకు ఖాతాల్లో రూ. 26,95, 17,733 డబ్బులు జమ చేశారు. 910 రేషన్ కార్డులు, 1144 ఇందిరమ్మ ఇండ్లు, 324మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల మంజూరు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చారు. అయితే మిగతా గ్రామాల్లో ఎప్పటి నుంచి అమలు చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
రైతు భరోసా 8,961
రేషన్ కార్డులు 910
ఇందిరమ్మ ఇళ్లు 1,144
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా : 324
గుండాల : మండలంలోని బురుజుబావిలో జరిగిన ప్రజాపాలన గ్రామసభలో తన పేరు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో రాలేదని గ్రామానికి చెందిన తోటకూరి బొజ్జమ్మ కన్నీటి పర్యంతమయ్యింది. తన కుటుంబం కిరాయి ఇంట్లో ఉంటున్నదని, తనకు దివ్యాంగుడైన కుమారుడు ఉన్నాడని, తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని తీవ్ర మనోవేదనకు గురయ్యింది. తన కొడుకుతో కలిసి మండల ప్రత్యేక అధికారి విష్ణువర్ధన్‌రెడ్డిని నిలదీసింది. దాంతో ఆయన వచ్చే విడుతలో ఇల్లు వస్తుందని చెప్పి గ్రామపంచాయతీ కార్యాలయంలోకి వెళ్లారు. ఆ ఆ తర్వాత ఆమెను పోలీసులు కార్యాలయం నుంచి బయటకు పంపించారు.
ఇటీవల వరుసగా నాలుగు రోజులపాటు గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేయగా.. గ్రామస్తుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం సైతం పథకాల అమలు కార్యక్రమంలో కొన్నిచోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. అర్హులకు కాకుండా అనర్హులకు కేటాయించారని ఆయా చోట్ల గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. లబ్ధిదారులను ఏ ప్రాతిపదికన కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. నారాయణ పురం మండలంలోని కోతులారంలో అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఉన్నోళ్లకే రెండేసి పథకాలు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు రాలేదని ఆ మండలం స్పెషల్ ఆఫీసర్ జయశ్రీ ని కారును అడ్డుకున్నారు. ఈ సందర్బంగా ఓ మహిళ కంట తడిపెట్టి.. బోరున విలపించింది. ఆత్మకూరు (ఎం) మండలంలోని తిమ్మాపురంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు అర్హులైన లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. గ్రామంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొని.. ఎంపికైన లబ్ధిదారులలో కొంతమందికి ప్రొసీడింగ్ పత్రాలను అందజేసి వెళ్లిపోయారు. అర్హత ఉండి కూడా జాబితాలో పేర్లు రాకపోవడంతో అర్హులైన వారందరికీ నాలుగు పథకాలను అందజేయాలని కోరుతూ గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక గుండాల మండలంలోని బురుజుబావి గ్రామంలో తన పేరు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జాబితాలో రాలేదని ఓ మహిళ బోరున విలపించింది. తనకు సొంత ఇల్లు లేక తాము కిరాయి ఇంట్లో ఉంటున్నానని, అన్యాయం జరిగిందని వాపోయింది.
ఆత్మకూరు(ఎం) : మండలంలోని తిమ్మాపురంలో ప్రభుత్వం ఆదివారం ప్రారంభించిన 4 పథకాల్లో నిజమైన అర్హులకు మంజూరు కాలేదంటూ పలువురు గ్రామస్తులు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కొంతమంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసి వెళ్లిపోయారు. తర్వాత మండలస్థాయి అధికారులు ఆర్హులైన జాబితాను చదువుతుండగానే కొంతమంది పేర్లు లేకపోవడంతో అధికారులను నిలదీశారు. దీంతో మధ్యలోనే అధికారులు కూడా వెళ్లిపోయారు. దీంతో జాబితాలో పేర్లు లేని ఆర్హులైన ప్రజలు ధర్నా నిర్వహించారు. గ్రామంలో ఒకే ఇంట్లో 3 ఇండ్లు మంజూరు చేశారని ఆరోపించారు. తప్పుడు సర్వే నిర్వహించిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
సంస్థాన్ నారాయణపురం : మండలంలోని కోతులాపురంలో ఆదివారం అందించిన పథకాల్లో అర్హులకు ఇచ్చారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. లబ్ధిదారులను ఏ ప్రాతిపాదికన గుర్తించారో చెప్పాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా వంగూరి నాగమ్మ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ‘నాకు గుంట భూమి లేదు సారు..కొడుకులు లేరు.. నాకు ఒక్కతే బిడ్డ.. కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నా.. ఆత్మీయ భరోసా పథకం పేపరు పెద్ద సార్లు నాకు ఇచ్చినారు..మరి ఇల్లు ఎందుకు ఇవ్వలేదు’ అని కన్నీటి పర్యంతమైంది. తనకు ఇందిరమ్మ ఇల్లే కావాలని ఆత్మీయ భరోసా పథకం ప్రొసీడింగ్ కాపీని అధికారికి తిరిగి ఇచ్చేసింది.