నవరాత్రులు పూజలు అందుకున్న వినాయకుడికి సోమవారం ఘనంగా వీడ్కోలు పలికేందుకు భక్తులు సిద్ధమవుతుండగా, ప్రశాంత వాతవరణంలో శోభాయాత్రలు సాగేందుకు పోలీస్ యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నది. నల్లగొండ జిల్లావ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులతోపాటు వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీ కెమెరాలతోపాటు ప్రత్యేకంగా మరో 280 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. వాటన్నింటిని స్ధానిక పోలీస్‌స్టేషన్‌తోపాటు జిల్లా పోలీస్ కార్యాలయానికి అనుసంధానం చేసి నిరంతర నిఘా పెట్టనుంది.
జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎస్పీతోపాటు ఐటీ సెల్ అధికారులు పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే అన్ని గణేశ్ విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేసిన పోలీసులు.. కేటాయించిన నంబర్ల వారీగా శోభాయాత్ర సాగేలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 14 ఫీట్లకు పైన ఉన్న విగ్రహాలను నాగార్జునసాగర్, వాడపల్లిలో, మిగతావి ఇతర ప్రాంతాల్లో నిమజ్జనం చేసేందుకు ఏర్పాటు చేశారు.
జిల్లా కేంద్రంలో 9 ఫీట్లకు లోపు ఏర్పాటుచేసిన విగ్రహాలను స్థానిక వల్లభరావు చెరువులో నిమజ్జనం చేయనున్నారు. మొత్తం 950మంది పోలీస్ సిబ్బంది, పోలీస్ వలంటీర్లు విధుల్లో ఉండనున్నారు. నిమజ్జనం సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కమ్యూనిటీ సంబంధిత కేసులు నమోదైన వారిని ఇప్పటికే బైండోవర్ చేశారు. రౌడీ షీటర్లతోపాటు క్రిమినల్ రికార్డ్ ఉన్న వారి కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో శోభాయాత్ర, నిమజ్జనానికి గణేశ్ ఉత్సవ కమిటీ, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిమజ్జన ప్రాంతాలను కలెక్టర్, ఎస్పీలు ఇప్పటికే పరిశీలించి పలు సూచనలు చేశారు. జిల్లా కేంద్రంలోని వల్లభరావు చెరువు, జిల్లాలోని వాడపల్లి, అడవిదేవులపల్లి, నాగార్జునసాగర్, దేవరకొండ, పెద్ద మునిగల్, డిండి, మిర్యాలగూడ, వేములపల్లి కాల్వల వద్ద పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఆయాచోట్ల విద్యుద్దీపాలతోపాటు బారికేడ్లు, క్రేన్లు ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. శోభాయాత్ర సందర్భంగా జిల్లాలోని అన్ని వైన్ షాపులను 24 గంటల ముందే మూయించనున్నారు.
నల్లగొండలో ట్రాఫిక్ డైవర్షన్
శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తి
జిల్లాలో నిమజ్జనం చేసే ప్రధాన ప్రాంతాలైన నల్లగొండ పట్టణంలోని వల్లభరావు చెరువు, మూసీ నది, 14వ మైలురాయి, మిర్యాలగూడ, వాడపల్లి, నాగార్జునసాగర్, దేవరకొండ, దయ్యాలగండి, అడవిదేవులపల్లి, కొండభీమనపల్లి, డిండి, వేములపల్లి కాల్వల వద్ద పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఫ్లడ్ లైట్లు, క్రేన్లను, పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశారు. నిమజ్జన ప్రాంతాల వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా జిల్లాలోని ఏ ప్రాంతానికైనా ఐదు నుంచి పది నిమిషాల వ్యవధిలో చేరుకునేలా పెట్రో వాహనాలు, బ్లూకోట్స్, సంబంధిత పోలీస్ అధికారులను అప్రమత్తం చేసే విధంగా ఆన్లైన్ విధానంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
950మందితో భద్రత
గణేశ్ నిమజ్జనం సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లాలో ఎస్పీతోపాటు ఇద్దరు ఏఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు, 28 మంది సీఐలు, ఐదుగురు ఆర్ఐలు, 70మంది ఎస్ఐలు, 620 మందికి పైగా ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ఏఆర్ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. వీరికి ఆదనంగా ఒక్కో సబ్ డివిజన్‌కు 80మంది చొప్పున మూడు డివిజన్లకు 250 మంది ట్రైనీ కానిస్టేబుళ్లను భాగస్వాములను చేస్తున్నారు. వీరితోపాటు తెలంగాణ స్పెషల్ పోలీస్, ఫారెస్టు, అబ్కారీ శాఖల అధికారులను సైతం బందోబస్తులో భాగస్వామ్యం చేశారు.
భక్తులు పాటించాల్సిన నిబంధనలు
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
గణేశ్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నాం. ఇందుకోసం నిర్వహకులకు, ఉత్సవ కమిటీ సభ్యులకు అవగాహన కల్పించాం. ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతి ఇవ్వడంలేదు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. నిర్వాహకులు కండీషన్లో ఉన్న వాహనాలను శోభాయాత్రకు వినియోగించాలి. మండపాలకు కేటాయించిన నెంబర్ల ప్రకారం శోభాయాత్రలో పాల్గొనాలి. రెవెన్యూ, మున్సిపల్, ఆర్ అండ్ బీ, జాతీయ రహదారులు, ఇరిగేషన్ అధికారులతోపాటు అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేశాం. మద్యం సేవించి శోభాయాత్రలో పాల్గొనవద్దు. నిమజ్జన ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాం. మండపాల నిర్వాహకులు చిన్నారులను నిమజ్జన ప్రాంతాలకు తీసుకురావద్దు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించనున్నాం.
– ఎస్పీ శరత్చంద్ర పవార్