అవును… నిజం… ఊరూరా తిరిగి కోడిగుడ్లు అమ్మే మాదిరిగా నెల కూడా తిరగని శిశువులను అమ్మేస్తున్నారు. కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన శిశువులు కొందరైతే… తినడానికి తిండి కూడా దొరకని అభాగ్యులకు కలిగిన సంతానాన్ని ఇరువై…ముప్పై వేలకు కొనుగోలు చేసి తీసుకువచ్చి అమ్మేవి మరికొన్ని. ఈ అక్రమ దందా చేసే కిలాడీ గుంపులో అత్యధికులు మహిళలే ఉన్నారు. నార్త్ నుంచి అధికంగా పిల్లలను ఇక్కడికి తీసుకువస్తుండగా నిన్న దొరికిన వారంతా అహ్మదాబాద్ టు సూర్యాపేట వయా విజయవాడ వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
సూర్యాపేట, మే 29 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో చిన్నారుల కొనుగోళ్ల కోసం ఎవరో వస్తున్నారని పోలీసులకు సమాచారం ఇవ్వగా ఓ గ్రామానికి చెందిన ఇద్దరు దానిపై ఆరా తీశారు. ఇందులో పోలీసులకు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు స్పెషల్ వింగ్‌గా ఏర్పడి విచారణ చేయగా జిల్లాలో మొత్తం 28 మంది చిన్నారులను విక్రయించగా 10 మందిని గుర్తించిన విషయం విదితమే. ముఠాలో 13 మందిని గుర్తించి అరెస్టు చేయగా వీరిలో 9 మంది మహిళలే ఉండడం గమనార్హం. మహిళా నిందితుల్లో విజయవాడకు చెందిన రమాలక్ష్మి, పావని, విజయలక్ష్మి, సత్యమణి, హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతానికి చెందిన శోభారాణి, రాజస్థాన్‌కు చెందిన ఖాన్షాహీనా, తిరుమలగిరికి చెందిన ఎండీ సహానా, హైటెక్ సిటీకి చెందిన సునీత, సూర్యాపేటకు చెందిన ఉమారాణి ఉన్నారు.
జిల్లాలో కొంతకాలంగా పిల్లలు లేని తల్లిదండ్రులను గుర్తించి వారికి శిశువులను విక్రయించారు. వీరంతా నార్త్ నుంచి తీసుకువచ్చిన వారని తెలిసింది. వీరిలో కొంత మంది శిశువులను కొనుగోలు చేసి తీసుకురాగా.. మరికొంత మంది చిన్నారులను కిడ్నాప్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన నక్క యాదగిరి, ఉమారాణి దంపతులు ఊరూరా తిరిగి కోడిగుడ్లు అమ్ముతారు. వీరు పిల్లలు లేని తల్లిదండ్రులను గుర్తించి వారికి శిశువులను విక్రయించినట్లు విచారణలో తేలింది. అత్యధికంగా గుజరాత్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి శిశువులను రూ.20 వేల నుంచి 30వేల వరకు కొనుగోలు చేసి విక్రయిస్తారు.
ఈ ముఠా విక్రయించే శిశువుల వయసు నెలలోపే ఉంటున్నది. తల్లులను దూరం చేసి వందలు, వేల కిలోమీటర్ల దూరం పాల సీసాలతో ప్రయాణాలు చేయించడం అంటే ఆ అరిగోస ఏ రీతిన ఉంటుందో చెప్పనలవికాదు. ఇక సూర్యాపేట పోలీసులు గుర్తించిన 10 మంది చిన్నారుల్లో ఒక సంవత్సరం నుంచి మూడేండ్ల వరకు ఉన్నారు. వారందరినీ నల్లగొండ శిశుహోంకు తరలించారు. కాగా ఈ కేసును సీఐడీకి బదిలీ చేయనున్నట్టు పోలీసుల విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.