యాదగిరిగుట్ట, మే 21 : మట్టి మాఫియా చెలరేగిపోతున్నది. ఇష్టారాజ్యంగా అక్రమ దందాకు తెరలేపుతున్నది. ప్రజాప్రతినిధుల అండదండలు, అధికారుల పర్యవేక్షణా లోపంతో రెచ్చిపోతున్నది. అడ్డగోలుగా చెరువుల్లోని మట్టిని తోడి కోట్లలో వ్యాపారం చేసి కాసులు దండుకుంటున్నది. ఇందుకు ఉదాహరణ.. మోటకొండూరు మండలంలోని వర్టూరు ఊర చెరువు. గోరంత అనుమతులు తీసుకొని.. కొండంత తవ్వకాలు చేపడుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి.
మోటకొండూరు మండలంలోని వర్టూరులో సుమారు 78 ఎకరాల మేర ఊర చెరువు ఉంది. ఈ చెరువు నిండి నీళ్లు నిల్వ ఉంటే వర్టూరుతో పాటు, గంగబాయి ఇతర చుట్టూ పక్క ప్రాంతాల వ్యవసాయ పొలాలకు సమృద్ధిగా నీళ్లందుతాయి. కానీ ఇప్పుడు ఆ చెరువులో సారవంతమైన నల్లమట్టి, ఒండ్రు మట్టిని కొందరు అడ్డగోలుగా తరలించుకుపోతున్నారు. ఈ చెరువులోని 3,200 మెట్రిక్ టన్నుల నల్ల మట్టిని కేవలం 3 ఫీట్ల లోతులో తోడుకునేలా యాదాద్రి భువనగిరి డివిజన్ ఇరిగేషన్ ఈఈ శైలేందర్ గత నెలలో 15 రోజులపాటు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత తమకు ఉన్న పరపతిని వినియోగించుకుని సదరు కాంట్రాక్టర్ అనుమతులను పొడిగించుకున్నారు. ఈ నెల 28వ తేదీ వరకు పర్మిషన్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
అయితే మీటరు లోతులో అనుమతులుంటే దాదాపు 10 ఫీట్ల పైన తోడేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే తవ్వకాల సమయంలో నీటిపారుదల శాఖకు సంబంధించిన సిబ్బంది అక్కడే ఉండి.. లాగ్ బుక్ రాసుకోవాలి. ఇంత పెద్ద మొత్తంలో మట్టిని తరలిస్తున్నా సిబ్బంది ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. మోటకొండూరు మండలంతో పాటు వలిగొండ తుర్కపల్లి బొమ్మల రామారం, యాదగిరిగుట్ట, తదితర మండలాల్లో సైతం ఇటీవల యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేపట్టారు.
నిబంధనల ప్రకారం మట్టిని ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తవ్వాలి. కానీ వర్టూరులో రాత్రి సమయంలో యథేచ్ఛగా చెరువు మట్టిని జిల్లా దాటిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో రోడ్లపై వెళ్లే లారీల మోతతో కంటిమీద కునుకులేకుండా పోతున్నది. కేవలం ఆరు వాహనాలకు మాత్రమే అనుమతి ఉండగా, సుమారు 20 నుంచి 30 టిప్పర్లు, రెండు నుంచి నాలుగు జేసీబీలు, హిటాచీతో మట్టిని తరలిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా కిక్కురుమనకుండా ఉంటున్నారు. పెద్దపెద్ద టిప్పర్లతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. ఓవర్లోడ్తో మట్టిని రవాణా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మోటకొండూరులోని ఓ ఇంటిపైకి టిప్పర్ దూసుకెళ్లడంతో స్లాబ్ కూలింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చెరువుల్లో మట్టి తవ్వకాలు జరుపుకోవచ్చని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి చెప్పారని జిల్లా ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఇటీవల సమావేశం నిర్వహించారని, చెరువుల్లో మట్టి తవ్వకాల ద్వారా పూడికతోపాటు సర్కారుకు ఆదాయం వస్తుందని తెలిపారన్నారు. ఇదే అదునుగా తీసుకున్న అధికారులు చెరువుల్లో మట్టి తవ్వకాలకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఏకంగా పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. చెరువుల్లో అనుమతులకు మించి, నిబంధనలకు విరుద్ధంగా మట్టి తోడాలని చెప్పా రా…? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొందరి తీరుతో ఇరిగేషన్ శాఖకు చెడ్డ పేరు వస్తున్నదని ఓ అధికారి వాపోవడం గమనార్హం.