పాలకవీడు, ఏప్రిల్ 27 : మండలంలోని జాన్పహాడ్ గ్రామ రెవెన్యూ శివారులో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. గ్రామంలోని 319 సర్వే నంబర్లో గల ప్రభుత్వ భూమిలో పెద్ద సంఖ్యలో జేసీబీలను ఉపయోగించి పదుల సంఖ్యలో టిప్పర్ల సహాయంతో అక్రమార్కులు మట్టి ని తరలించి సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.
దీని వల్ల ప్రభుత్వ భూములు ధ్వంసమవుతున్నాయని, భారీ టిప్పర్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా నిర్భయంగా పట్టపగలే మట్టిని కొల్లగొట్టి విధ్వంసం సృష్టిస్తున్నా రెవెన్యూ అధికారులుగానీ, పోలీసు అధికారులుగానీ పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.
మట్టి తరలింపులో అధికార పార్టీ నాయకుల హస్తం ఉండడంతోనే అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా మట్టి తరలింపుపై పలువురు విలేకరులు ఇన్చార్జి తాసీల్దార్ కమలాకర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం గమనార్హం. దీనిపై హుజూర్నగర్ ఆర్డీఓ శ్రీనివాసులును ఫోన్లో వివరణ కోరగా అందుబాటులోకి రాలేదు.