యాదాద్రి భువనగిరి, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : ఇసుక అక్రమ దందారాయుళ్లు అనుమతులు లేకుండా ఇసుకను తీస్తూ పంట పొలాలు ఎండిపోవడానికి కారణమవుతున్నారు. తమ స్వార్థం కోసం ఎక్కడికక్కడ భూగర్భజలాలు ఇంకిపోయేలా కారకులయ్యారు. జిల్లాలో ముఖ్యంగా రాజాపేట, ఆలేరు, గుండాల, మోత్కూరు, అడ్డగూడూరు తదితర మండలాల్లో తోడేళ్లు మాదిరి ఇసుక తోడుతూ పంటలను ఎండబెడుతున్నారు. దీనిపై ఏకంగా పలు గ్రామాల రైతులు సోమవారం ప్రజావాణిలో ఉన్నతాధికారులకు వేర్వేరుగా ఫిర్యాదు చేసి, తమ గోడును వెల్లబోసుకున్నారు.
గంధమల్ల చెరువు మత్తడి వాగు రాజాపేట మండలంలోని రేణికుంట, బేగంపేట గ్రామాల శివారు గుండా వెళ్తుంది. ఈ వాగు నుంచి నాలుగైదు నెలలుగా కాళేశ్వరం నీళ్లు ప్రవహిస్తున్నాయి. అయితే ఈ నీటి ద్వారా రెండు గ్రామాల్లోని బావులు, బోర్లలో భూగర్భ జలాలు పెరుగుతాయనే ఆశతో రైతులు యాసంగిలో వందల ఎకరాల్లో వరి వేశారు. కానీ కొంత మంది ఇసుక అక్రమ వ్యాపారులు, కొందరు ట్రాక్టర్ యజమానాలు ఏకమై విచ్చలవిడిగా దందా చేస్తున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా జేసీబీల ద్వారా ఇసుకను తోడుతున్నారు. ఇలా జిల్లాలోని వివిధ మండలాలతోపాటు సిద్దిపేట, జనగాం, జగదేవ్పూర్,గజ్వేల్, బచ్చన్నపేట, చర్యాల తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
అడ్డూఅదుపు లేకుండా రాత్రి పగలు అనే తేడా లేకుండా జోరుగా దందాను కొనసాగిస్తున్నారు. దీని వల్ల బోర్లు, బావుల్లో భూగర్భ జలాల్లో అడుగంటి వరి పంటలు ఎండిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇదే విషయంపై ఇసుక అక్రమార్కులను ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తూ బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. భయాందోళనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాజాపేట మండలంలో చాలా గ్రామాల్లో పంట పొలాలు ఎండిపోయి.. కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. మరోవైపు రైతులు అరిగోస పడుతున్నా అధికార, పోలీస్ యంత్రాంగం పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండల అధికారులు, పోలీసులకు విన్నవించినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. స్వయంగా ఇసుక ట్రాక్టర్లను పట్టించినా వెంటనే వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.