అర్వపల్లి నవంబర్ 14 : అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి సూర్యాపేట జిల్లా నాయకుడు పోలేబోయిన కిరణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన స్పందిస్తూ.. మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, తడిసిన వరి, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఖమ్మం కలెక్టరేట్ ముందు శుక్రవారం శాంతియుతంగా ధర్నా చేస్తున్న అఖిల భారత రైతు కూలి సంఘం (AIKMS) నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలన్నారు.
నష్టపోయిన రైతాంగం తమ బాధను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం కోసం కలెక్టరేట్ ముందు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రైతుల పక్షపాతి అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ఆ రైతుల కోసం పోరాడుతున్న నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఆయన దుయ్యబట్టారు. అక్రమ కేసులు ఎన్ని పెట్టి జైలులో నిర్భందించినా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని పేర్కొన్నారు.