నల్లగొండ నమస్తే తెలంగాణ, మార్చి 26 : తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నకిరేకల్ పోలీస్ స్టేషన్లో రెండు వేర్వేరు కేసులు నమోదైన విషయం తెలిసిందే. స్థానిక కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు కేటీఆర్‌తో పాటు సోషల్‌మీడియా ఇంచార్జిలు మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. నకిరేకల్‌లో పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసులోని నిందితులతో తమకు సంబంధం లేకున్నా సోషల్‌మీడియా వేదికగా తమపై తప్పుడు ప్రచారం చేశారంటూ నకిరేకల్ మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రజిత, మరో వ్యక్తి ఉగ్గిడి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు.
కేటీఆర్‌పై పెట్టిన అక్రమ కేసులపై నల్లగొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చిరుమర్తి లింగయ్య మాట్లాడారు. నకిరేకల్ పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో స్థానిక ఎమ్మెల్యే వీరేశం అనుచరులే ఉన్నట్లు తెలిపారు. దాని వెనక వీరేశం హస్తం ఉన్నదని తమ అనుమానం అన్నారు. ఎమ్మెల్యే డ్రైవర్ ఉగ్గిడి శ్రీనివాస్ దీని వెనక అసలు సూత్రదారి అన్నారు. ఎమ్మెల్యే బెదిరింపులతో పోలీసులు అతడిని కేసు నుంచి తప్పించినట్లు చెప్పారు. నిందితులు స్కూల్ యాజమాన్యాలతో భారీ మొత్తంలో ప్యాకేజీ మాట్లాడుకుని రోజు వారిగా పేపర్ లీకేజీ చేసేందుకు కుట్రలు చేసినట్లు తెలిపారు. ఒక అమ్మాయిని బెదిరించి పేపర్ లీక్ చేయాలని ప్రయత్నం చేశారన్నారు. నకిరేకల్‌లో దాడులు, దౌర్జన్యాలు, ఆక్రమణలు వీరేశం మనుషుల నైజం అన్నారు. పేపర్ లీకేజీపై ఒక పేపర్లో వచ్చిన క్లిపింగ్‌ను కేటీఆర్ షేర్ చేసినట్లు తెలిపారు. దీని ఆధారంగా ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు.
ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా, కేటీఆర్‌ను చూస్తేనే ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకు లాగులు తడుస్తున్నట్లుగా ఉందన్నారు. పోలీసులను బెదిరుస్తూ అక్రమ కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా పెడతారు. సీఎం మెప్పు కోసం ఎమ్మెల్యే ఇక్కడ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అజ్ఞాతం నుంచి నుంచి వీరేశం బయటకు వచ్చిందే బీఆర్ఎస్తో కదా. బీఆర్ఎస్ లో పనిచేసి వెళ్లిన వేరేశానికి కేటీఆర్‌నే విమర్శించే స్థాయి లేదన్నారు. ఇటీవల ఒక సందర్భంగా సీఎంకు స్వీట్ ఇవ్వబోతే నెట్టేసింది నిజం కాదా అన్నారు. ప్రతీదానికి కేసులు పెట్టడం వీరేశానికి ఫ్యాషన్ గా మారిందన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు బుద్ది చెప్పడం ఖాయం అన్నారు. పోలీస్ అధికారులు కూడా అక్రమ కేసులపై ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ నేతల దాడులను, దౌర్జన్యలను తిప్పికొట్టె రోజులు దగ్గరలోనే ఉన్నట్లు తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ భయపడబోదు, అక్రమ కేసులు ఎదుర్కొంటూ ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని పేర్కొన్నారు.