పెన్‌పహాడ్, సెప్టెంబర్ 20 : పెన్‌పహాడ్‌లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల అక్రమ అరెస్టులు కలకలం రేపింది. గత కొద్దిరోజుల క్రితం జిల్లాలోని చివ్వెంల మండల పరిధిలోని దురాజ్‌పల్లి 5వ వార్డు బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ బాషాను ఎటువంటి ఆధారాలు లేకుండా అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో పోలీసులు అరెస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడంతో వెంటనే విడుదల చేశారు. అదే తరహాలో పెన్‌పహాడ్ మండలంలో ముగ్గురు బీఆర్ఎస్ను నాయకుల అక్రమ అరెస్ట్ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కలకం రేపింది.
ఇటీవల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ చిత్రపటాలు కాంగ్రెస్ నాయకులు పెట్టడంతో బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో ప్రజా సొత్తుగా ఉన్న క్యాంప్ కార్యాలయంలో ఏఏ ఫొటోలు ఉంచాలన్నా, తీసివేయాలన్నా అధికారులు చూసుకుంటారని.. కాంగ్రెస్ జేజేలు అంటూ క్యాంప్ కార్యాలయంలోకి అక్రమంగా చొచ్చుకు పోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం చెంది సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతల చర్యలను పోస్ట్ చేశారు.
పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్న.. అసలు కారణం ఏమిటో గోప్యంగా ఉంచారు. మొదట అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నాయకులు దొంగరి యుగేందర్, యళ్లంల జగన్, పర్వతం నాగయ్య గ్రామంలో గొడవలు సృష్టిస్తున్నారని, అందుకే ముందస్తు చర్య తీసుకున్నారా.. రాజకీయ ఒత్తిడి కారణంగానే ఈ చర్య తీసుకున్నారన్న చర్చ మండల వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది.
అరెస్టు వార్తతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్ వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒత్తిడి పెరగడంతో పోలీసులు చివరికి ఆ నాయకులను విడుదల చేశారు.