నీలగిరి, డిసెంబర్ 7 : నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా పోలీస్ యంత్రాంగం బీఆర్ఎస్ నాయకులపై దమనకాండ సాగించింది. బీఆర్ఎస్ పాలనలో అప్పటి సీఎం కేసీఆర్ మంజూరు చేసిన నిధులతో చేపట్టిన నిర్మాణాల ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ ఉనికి లేకుండా ఉండేందుకు వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను శుక్రవారం అర్ధరాత్రి నుంచే అక్రమంగా అరెస్ట్ చేశారు. గ్రామస్థాయి కార్యకర్త నుంచి మాజీ ఎమ్మెల్యేల వరకు అందరినీ అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు చేసిన నాయకులను స్థ్ధానిక పోలీస్ స్టేషన్లలో కాకుండా ఇతర స్టేషన్లకు తరలించారు. మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నల్లబోతు భాస్కర్‌రావు, జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఐసీడీఎస్ మాజీ ఆర్ఓ మాలె శరణ్యరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల ఇంటి వద్ద 20మందికిపైగా పోలీసులు పహారా కాశారు. గురువారం మెడికల్ కళాశాల వద్ద కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసిన నాయకులను అదుపులోకి తీసుకుని విడుదల చేయలేదు. నల్లగొండలో మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కనగల్ మాజీ ఎంపీపీ కరీంపాషా, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్‌తోపాటు పలు మండలాల అధ్యక్షులు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర ముఖ్యనాయకులను అరెస్టు చేశారు.
ట్రాఫిక్ మళ్లింపుతో ఇబ్బందులు..
సీఎం పర్యటన సందర్భంగా జిల్లాలో పోలీసులు దేవరకొండ, నాగార్జునసాగర్ వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. దేవరకొండ రోడ్డులోని అక్కలాయిగూడెం, రూరల్ పోలీస్ స్టేషన్ క్రాస్‌రోడ్డు, ఎస్ఎల్బీసీ క్రాస్ రోడ్డుల వద్ద బారికేడ్లు పెట్టి వాహనాలను మెడికల్ కళాశాల సభ వద్దకు రాకుండా నిలిపివేశారు. సీఎం సభకు మండల సూపర్వైజరీ అధికారులను ఏర్పాటు చేసి జనాన్ని తరలించారు. వారి వాహనాలను అయ్యప్ప గుడి వద్దే నిలిపివేశారు. కొన్నింటికి డాన్బస్కో స్కూల్లో పార్కింగ్ ఇచ్చారు. మిగతా వాహనాలను దానికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పార్కింగ్ చేశారు. అధికారులు, వీఐపీల వాహనాలకు బత్తాయి మార్కెట్లో పార్కింగ్ ఇచ్చారు. దాంతో సభా స్థలానికి రెండు కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చింది. కాంగ్రెస్ నేతలు గ్రామాల నుంచి వృద్ధులను సైతం తీసుకరావడంతో వారు నడువలేక ఇబ్బందులు పడ్డారు.
సీఎంతో ముఖాముఖికి కొందరు విద్యార్థులే..
మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా వైద్య విద్యార్థులతో సీఎం ముఖాముఖి ఏర్పాటు చేశారు. దాంతో విద్యార్థులు తమ సమస్యలు చెప్పొచ్చని భావించారు. కానీ పోలీసులు కేవలం ఎంపిక చేసిన కొద్దిమందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. దాంతో మెజారిటీ విద్యార్థులు, సిబ్బంది రోడ్డుపైనే ఉండిపోయారు.
ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీనే: మాజీ ఎమ్మెల్యే కంచర్ల
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యమేనని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి విమర్శించారు. పోలీస్ హౌస్ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలను వేధింపులకు గురిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తుందని మండిడపడ్డారు. జిల్లాకు సీఎం వంటి వ్యక్తులు వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకులను ఆహ్వానించి అభివృద్ధిపై చర్చించాల్సింది పోయి.. ఎక్కడిక్కడ అరెస్టులు చేయించి పైశాచిక అనందం పొందుతున్నారన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కమీషన్ల కోసం ఉద్దేశించిన ప్రాజెక్టు బ్రహ్మణ వెల్లంల రిజర్వాయర్ అని పేర్కొన్నారు. అప్పటి సీఎం వైఎస్ఆర్ను 450 కోట్లతో ప్రాజెక్టు డిజైన్ చేస్తే.. 35 కోట్ల రూపాయల కమీషన్ తీసుకుని ఉన్నచోటే తవ్వి వదిలేశారని ఆరోపించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అంచనా వ్యయం 650 కోట్లకు పెంచి ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించారన్నారు. మెడికల్ కళాశాల, యాదాద్రి థర్మల్ ప్లాంట్ కూడా కేసీఆర్ పుణ్యమేనని తెలిపారు.