నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్28(నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నూతన కలెక్టర్‌గా టూరిజం శాఖ డైరెక్టర్‌గా పని చేస్తున్న 2017 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఇలా త్రిపాఠీని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. లక్నోకు చెందిన ఇలా త్రిపాఠీ 2017 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ముందుగా కేంద్ర సర్వీసుల్లో భాగంగా ఢిల్లీలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పని చేశారు. తర్వాత మంచిర్యాలలో అసిస్టెంట్ కలెక్టర్‌గా 2020 వరకు విధులు నిర్వర్తించారు. అక్కడి నుంచి 2020లో ములుగు కలెక్టర్‌గా భాధ్యతలు చేపట్టి 2024 జూన్ 15 వరకు పని చేశారు. జిల్లా కలెక్టర్‌గా మేడారం సమక్క సారలమ్మ జాతరను విజయవంతంగా జరిపించారు. కాగా, నల్లగొండ జిల్లాకు ఒక్క ఏడాదిలోనే ముగ్గురు కలెక్టర్లు మారడం చర్చనీయాంశంగా మారింది.
కలెక్టర్లుగా వచ్చిన వారూ… అలా వచ్చి కుదురుకుని జిల్లా పాలనపై పట్టు సాధించేలోపే ఆకస్మికంగా మార్చేయడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెరుగైన పాలన కోసమా అంటే అదీ లేదని చెప్పవచ్చు. ఈ ఏడాది జనవరి 3న కలెక్టర్లను ప్రభుత్వం పెద్దఎత్తున బదిలీ చేసింది. ఆ సమయంలో నల్లగొండ కలెక్టర్‌గా 2010 బ్యాచ్ ఐఏఎస్‌కు చెందిన దాసరి హరిచందన అదే నెల 8న బాధ్యతలు చేపట్టారు. ఆమె వచ్చాక వరుస ఎన్నికలతోనే సరిపోయింది. ఎంపీ ఎన్నికలు ముగిసిన వెంటనే హరిచందన బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 15న ఐఏఎస్‌ల బదీల్లో భాగంగా ఆమె స్థానంలో వికారాబాద్ కలెక్టర్‌గా ఉన్న సి.నారాయణరెడ్డి(2015 బ్యాచ్ ఐఏఎస్) బదిలీపై వచ్చారు.
చింతకుంట నారాయణరెడ్డి ఎక్కడ పని చేసినా ఆ జిల్లాల పాలనలో తనదైన ముద్రతో పని చేస్తారనే పేరుంది. నల్లగొండ కంటే ముందు ములుగు, నిజామాబాద్, వికారాబాద్ కలెక్టర్‌గా పని చేసిన ఆయన ఇక్కడా పాలనలో తన మార్క్‌ను చూపారు. నల్లగొండ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రభుత్వ వైద్యం, విద్యా రంగం, రెవెన్యూ విభాగాలకు ప్రాధాన్యమిస్తూ సంస్కరణలు చేపట్టారు. ముఖ్యంగా జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ మెరుగైన వైద్య సేవల కోసం తపించారు. ఆ తర్వాత ప్రభుత్వ విద్యా సంస్థలపైనా దృష్టి సారించి పాఠశాలలు తనిఖీలు చేస్తూ నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేశారు.
పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులపైనా ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రంలోనే అత్యధిక ఫైళ్లను స్పెషల్ డ్రైవ్ ద్వారా క్లియర్ చేసి రెవెన్యూ సమస్యల పరిష్కారంలోనూ తనదైన ముద్ర వేశారు. దాంతోపాటు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో పరిస్థితిని మెరుగుపరిచే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తొలిసారిగా గ్రామ, తర్వాత మండల స్థాయిలోనూ గ్రీవెన్స్ సెల్లు ఏర్పాటు చేసి స్థానికంగానే ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపారు. ఇలా ఒక్కో పాలన అంశంలో తనదైన ముద్రతో ముందుకు సాగుతున్న క్రమంలోనే నారాయణరెడ్డిని సైతం జిల్లా నుంచి బదిలీ చేయడం విస్మయానికి గురిచేస్తున్నది. జిల్లాపై పట్టు సాధించి పాలనాపరమైన అంశాలపై దృష్టి సారిస్తున్న క్రమంలోనే కలెక్టర్లను మార్చడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో హరిచందన 5 నెలల 7 రోజుల పాటు కలెక్టర్‌గా పని చేస్తే… నారాయణరెడ్డి 4 నెలల 12 రోజుల పాటు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించడం గమనార్హం.