నల్లగొండ సిటీ ఏప్రిల్ 29 : ధాన్యం కొనుగోలు విషయంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు సమాధానం చెప్పుకోలేక కనగల్ మండలం బచ్చనగూడెం ఐకేపీ సెంటర్ ఇన్చార్జి కొప్పుల సైదులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే…. కనగల్ మండలం బచ్చనగూడెం ఐకేపీ సెంటర్ ఇన్చార్జి కొప్పుల సైదులు ఆత్మహత్యయత్నానికి ముందు సెల్ఫీ వీడియో విడుదల చేస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఆయన వీడియోలో తెలిపిన వివరాల ప్రకారం ధాన్యం సేకరణ విషయంలో మిల్లర్ల వేధింపులతోపాటు రైతుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన ఆత్మహత్యతోనైనా కొనుగోళ్లు సజావుగా సాగాలంటూ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రానికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు సెంటర్లలో పోసి నెలలు గడుస్తున్నా కొనుగోలు చేసే దిక్కేలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సైదులును చికిత్స నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సైదులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు.
పట్టించుకోని అధికారులు..
కొద్ది రోజుల క్రితం లారీలను పంపించినా వాటిని అన్లోడ్ చేయకుండా బీ గ్రేడ్ ధాన్యం అని చెబుతూ ఇబ్బందులు పెడుతున్నట్లు సైదులు వీడియోలో తెలిపారు. ఈ విషయం అధికారులకు తెలిపినా పట్టించుకోకుండా రైతులతో సమన్వయం చేసుకోవాలి అంటున్నారే తప్ప ధాన్యం దిగుమతి గురించి పట్టించుకోవడం లేదన్నాడు. రైతులకు తెలియజేయగా తమకు సంబంధం లేదని, 42 కేజీలు తూకం వేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారని సైదులు వీడియోలో తెలిపారు.
పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే..
సైదులు ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి బుధవారం రాత్రి నల్లగొండ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న సైదులును పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను అనేక ఇబ్బందులు పెడుతోందన్నారు. సెంటర్లకు ధాన్యం తెచ్చి నెల రోజులు దాటుతున్నా ధాన్యం కొనే దిక్కే లేదని అన్నారు. ఎన్నికల్లో రైతులకు మాయ మాటలు చెప్పిన ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా బూటకపు మాటలు చెబుతోందన్నారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు చేసి రైతులను అదుకోవాలన్నారు.