– 75 రోజుల్లో 1,500 కేసులు పరిష్కారం
– నల్లగొండ మీడియా సమావేశంలో వెల్లడి
నల్లగొండ, జులై 01 : హక్కులకు భంగం కలిగితే బాధితులు ఫిర్యాదు చేయొచ్చని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్ అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని రోడ్లు, భవనాల అతిథి గృహంలో మీడియాతో ఆయన మాట్లాడారు. మానవ హక్కులకు భంగం కలిగినప్పుడు వచ్చిన ఫిర్యాదులను కమిషన్ పరిశీలించి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఆన్లైన్ ద్వారా లేదా రాత పూర్వకంగా దరఖాస్తు ఇస్తే వాటిని పరిశీలించి, విచారణ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. విచారణ అనంతరం అవసరమైతే ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరుగుతుందని తెలిపారు.
తాము బాధ్యతలు స్వీకరించే నాటికి రాష్ట్రంలో 11,500 కేసులు పెండింగ్లో ఉన్నట్లు వెల్లడించారు. కాగా గడచిన రెండున్నర నెలల్లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ 1,500 కేసులను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. వర్కర్స్ కు జీతాలు చెల్లించకపోవడం, వారి హక్కులకు, స్వేచ్ఛకు, సమానత్వానికి ఆటంకం కలిగించడం వంటివన్ని మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తాయన్నారు. వీటిపై ఫిర్యాదులు వస్తే స్పందించడం జరుగుతుందన్నారు. సమస్య తీవ్రతను అనుసరించి సుమోటోగా కేసులు పరిష్కరించడం జరుగుతుందని, అలాగే బాధితుల తరఫున ఇచ్చే దరఖాస్తులను సైతం కమిషన్ స్వీకరిస్తుందన్నారు. ముఖ్యంగా విద్య, వైద్య తదితర సంస్థలను పరిశీలించి సరైన విధంగా అమలవుతున్నది, లేనిది పరిశీలించడం జరుగుతుందన్నారు.