నీలగిరి, మే 07 : అధికార మదం, అహంకారంతో మాట్లాడితే ఏమాత్రం ఊరుకునేది లేదని, తగిన గుణపాఠం చెబుతామని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులను హెచ్చరించారు. గురువారం నకిరేకల్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్ రావుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నకిలీ నక్సలైట్‌గా ఉండి దొంగ ఉద్యమాలు చేసిన ఎమ్మెల్యే వీరేశంకు తనకు రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుని విమర్శించే స్థాయి లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల భాష చాలా దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నాయకులపై పోలీసు యంత్రాంగంతో అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. మోసపూరిత మాటలు, అమలు కానీ హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కి కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరిట తెలంగాణ రైతులను మోసం చేశారని విమర్శించారు.
నకిరేకల్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిన విధులే తప్పా ఈ ప్రభుత్వంలో పైసా నిధులు రాలేదన్నారు. ఆనాటి పథకాలను మార్చి తాను మంజూరు చేసిన పనులకు శిలాపలకాలు మార్చి చేస్తున్నారు తప్ప కొత్తగా తెచ్చిన రుపాయి లేదని విమర్శించారు. బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ కు నేటికీ ఒక్క రూపాయి కూడా తీసుకు రాలేదని ఆసమర్ధ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే విధులు తెచ్చి పనులు చేయించానని నేటికీ అదే పనులు పూర్తి చేసి నీరు విడుదల చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు నకిరేకల్ నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలకు బ్రాహ్మణ వెల్లంల ద్వారా నీరు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. పక్క నియోజకవర్గాలకు నీరు తీసుకెళ్తుంటే తన నియోజవర్గంలో ప్రాజెక్టు ఉండి కూడా ఏమి చేయలేని అసమర్థ ఎమ్మెల్యే అని విమర్శించారు. నకిరేకల్ నుండి హైదరాబాద్ వరకు ఎక్కడ పడితే అక్కడ దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. చెరువుపెళ్లిలో మట్టి తరలించేందుకు అధికారులపై ఒత్తిడి చేసి అనుమతులు తీసుకున్నాడని, వాస్తవాలు మాట్లాడకుండా స్థాయిని మించి మాట్లాడుతున్నట్లు విమర్శించారు. నల్లగొండ జిల్లా పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న బెదిరింపులు, భూ కబ్జాలలో నకిరేకల్ ఎమ్మెల్యే హస్తం ఉందని, దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలన్నారు.
ఇక ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నోరుకు అడ్డూ అదుపు లేకుంగా పోయిందన్నారు. ఉద్యమ నాయకుడు హరీశ్ రావును విమర్శించే స్థాయి ఆయనకు లేదన్నారు. హరీష్ రావు లాంటి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. హరీశ్‌రావును విమర్శిస్తే మంత్రి పదవి ఇస్తారన్న అపోహలో బీర్ల అయిలయ్య ఉన్నట్లు కనిపిస్తుందన్నారు. ఆయన భూ దందాల గురించి యాదగిరిగుట్ట ప్రాంత ప్రజలకు బాగా తెలుసన్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీల పేరిట యాదాద్రి భువనగిరి జిల్లాలో వందల కుటుంబాలను రోడ్డున పడేసిన చరిత్ర బీర్ల అయిలయ్యది అన్నారు. సామాన్య ప్రజలను ఆసరాగా చేసుకుని నేడు వేల కోట్లకు పడగలెత్తిన అయిలయ్య బాగోతం ఆలేరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్నారు. 2023 ఎన్నికల అఫిడవిట్లో కేవలం 30 ఎకరాలే ఉన్నట్లు చూపెట్టిన వ్యక్తికి రెండున్నరేళ్లలో వందల ఎకరాల భూములు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు. భూ భారతి రికార్డులో బీర్ల అయిలయ్య కుటుంబ సభ్యుల పేరిట కేవలం మూడు గ్రామాల్లోనే 250 ఎకరాల భూమి ఉందని, అది ఆయనకు ఎలా వచ్చిందని, దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి.. అయిలయ్య భూ దందాలపైన ఈడీ, సిబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నకిరేకల్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.