సూర్యాపేట టౌన్, మార్చి 17 : నోరు తెరిస్తే బూతులు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడుతున్న పదజాలం ఏమిటని, అలాంటి పదజాలాన్ని ఖండించని మేధావులు రాష్ట్రంలో ఉన్నారంటే దిగజారుడు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. పొద్దుగాల లేస్తే కేసీఆర్ జపం తప్పితే ముఖ్యమంత్రికి బతుకు లేదన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి స్పీకర్‌ను అవమానించాడంటున్నారు. ఆ వీడియోలు చూస్తే ఎక్కడా అలా లేదని, అయినా దాన్ని సాకుగా చూపి దళిత స్పీకర్‌ను అంటారా అని ప్రశ్నిస్తున్నారు. పదే పదే స్పీకర్‌ను దళిత స్పీకర్ అంటూ కాంగ్రెస్ నాయకులే అవమానిస్తున్నట్లు తెలిపారు. ఓ పదవి వచ్చిన తర్వాత కూడా స్పీకర్‌ను స్పీకర్‌గా గుర్తించకుండా దళిత స్పీకర్ అంటున్న కాంగ్రెస్ నాయకులు ఇకనైనా తీరు మార్చుకోవాలన్నారు. జగదీశ్ రెడ్డి ఎక్కడా తప్పుగా మాట్లాడకపోయినా సభ నుంచి బయటకు పంపించారన్నారు. ఆయన అసెంబ్లీలో ఉంటే వారి ఆటలు సాగడం లేదని అందుకే బహిష్కరించినట్లు చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని, చేవలేని పనితనాన్ని ఎండగడుతూ ప్రజల పక్షాన కొట్లాడే ప్రధాన పాత్ర బీఆర్ఎస్ పోషిస్తుందని అందులో భాగంగా ఈ నెల 20న సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నట్లు వెల్లడించారు. అలాగే ఏప్రిల్ 27న జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు కిశోర్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మహిళా జర్నలిస్ట్ అయినా సరే ఏ జర్నలిస్ట్ అయినా యూట్యూబ్, సోషల్ మీడియావాళ్లు ఇష్టమొచ్చినట్లు రాసినా, మాట్లాడినా తోలు తీస్తా, బట్టలూడదీసి కొడుతా అని మాట్లాడుతున్నరంటే ముఖమంత్రి రేవంత్‌రెడ్డికి మతిభ్రమించి ఉండాలన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆ భాష మాట్లాడితే ఒక్క మేధావి, ఒక్క జర్నలిస్ట్ మాట్లాడడం లేదని స్పీకర్ రికార్డుల్లో నుంచి తొలగించాల్సింది పోయి నవ్వుకుంటూ కూర్చున్నాడన్నారు. బడ్జెట్లో పెట్టడానికి డబ్బులు లేవు, చెప్పిన హామీలు అమలు చేస్తానికి చేతకాదు. 1వ తారీఖు జీతాలు ఇవ్వలేదు. ఇక డీఏల సంగటి చుద్దాం చేద్దాం.. వాటి నుంచి పక్కదారి పట్టాలంటే కేసీఆర్, కేటీఆర్, జగదీష్ రెడ్డిలను ఏదో ఒకటి అని పక్కదారి పట్టించే చేతగాని వాడు చేసే రాజకీయమీదన్నారు. నోటికి ఏది వస్తే అడి మాట్లాడకుండా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో వేల ఎకరాలు ఎండిపోతున్నాయని, స్విచ్ వేస్తే కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి నుంచి నంది మేడారం, లక్ష్మి పంప్ హౌజ్, గాయత్రి పంప్ హౌజ్ దాటుకుని నీళ్లు వస్తాయని కానీ ఇస్తలేరని దుయ్యబట్టారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని, సమీక్షలు పెట్టడు తెలవకుంటే తెలుసుకోడన్నారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటిలో ఎలాంటి దర్నాలు, రాస్తారోకోలు చేయొద్దని ఆదేశాలు జారీ చేస్తావా, ప్రజాపాలన అన్న నీకు ఎందుకు భయమైతుందని ప్రశ్నించారు. ప్రజాపాలనలో కనీసం నిరసన తెలిపే హక్కు లేదా? ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత రేవంత్ ఏం మాట్లాడుతున్నాడో ప్రజలంతా గమనించాలని కోరారు. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకోవాలని, చంద్రబాబుకు చెంచాలా పని చేస్తున్న ముఖ్యమంత్రికి రేవంత్‌రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు.
ఈ నెల 20న సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని అలాగే మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశానికి మాజీ ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు, గ్రామ గ్రామం నుంచి ముఖ్య నాయకులు హాజరు కావాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్ 27న జరిగే బీఆర్ఎస్ బహిరంగసభ విజయవంతంపై చర్చించడం జరుగుతుందన్నారు. అలాగే జిల్లాలో వచ్చిన కరువుతో సాగునీరు ఇవ్వకుండా కాళేశ్వరంలో నీళ్లున్నా కేసీఆర్‌కు మంచి పేరు వస్తదని కాలేశ్వరం నీళ్లు డంప్ చేసి ఇవ్వకుండా రైతుల పంట పొలాలను ఎండబెడుతున్న తీరుపై, కరెంట్ సమస్య, ప్రజల మౌలిక సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు.
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అవి అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. ఇచ్చిన హామీలు మరిచి నామ మాత్రంగా పథకాలు అమలు చేసి అన్ని పథకాలు ఇచ్చామని ప్రచారం చేస్తుండడాన్ని ఆయన దుయ్యబట్టారు. పంటలు ఎండిపోకుండా నీటిని ఇచ్చేందుకు ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నా కాల్వల్లో రైతులకు నీళ్లు అందడం లేదన్నారు. వారబంది ప్రకారం నీళ్లు ఇస్తామంటే నమ్మి పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తే నేడు అప్పులపాలై రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. అవగాహన లేని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు అసహనం ప్రకటిస్తున్నారన్నారు. ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ సైన్యం వెంటపడుతుందన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, దావుల వీరప్రసాద్ యాదవ్, జీడి భిక్షం, తూడి నరసింహారావు పాల్గొన్నారు.