మిర్యాలగూడ, ఆగస్టు 24 : గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకపోతే చర్యలు తప్పవని ఎస్టీ వెల్ఫేర్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్ హెచ్చరించారు. మండలంలోని అవంతీపురం గిరిజన గురుకుల పాఠశాలను శనివారం ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. పాఠశాలలో ఏడుగురు ఉపాధ్యాయు లు హాజరు కాకపోవడం, రికార్డ్ మెయింటెనెన్స్ సరిగా చేయకపోవడంతో ప్రిన్సిపాల్ అజయ్‌కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డైనింగ్ హాల్‌ను చూసి అసహనానికి గురయ్యారు. విద్యార్థులకు మెనూ పాటించకుండా నాసిరకం భోజనం అందిస్తుండడం పట్ల సిబ్బందిని మందలించారు. విద్యార్థులకు తప్పనిసరిగా తాజా కూరగాయలతో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. నాసిరకం కూరగాయలు పంపిణీ చేస్తున్న విషయంపై జేసీకి రిపోర్ట్ చేయాలన్నారు. ఇలాంటివి మళ్లీ పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ క్రమశిక్షణతో బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. ఆయన వెంట ఆర్సీఓ అగస్టీన్ ఉన్నారు.